Yadagirigutta: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:04 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. లోకకల్యాణం కోసం ఏటా నిర్వహించే దేవదేవుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు స్వస్తివాచకంతో శ్రీకారం చుట్టారు.

యాదాద్రి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. లోకకల్యాణం కోసం ఏటా నిర్వహించే దేవదేవుడి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు స్వస్తివాచకంతో శ్రీకారం చుట్టారు. అర్చకులు, వేదపండితులు, రుత్వికుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వస్తివాచకంతో ప్రారంభించి, పుణ్యాహవాచనం కార్యక్రమాలు నిర్వహించారు. ఆగమ శాస్త్రానుసారం స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రధానాలయంలో నిర్వహిస్తున్నారు. స్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల మొదటిరోజున సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడికి తొలిపూజలు చేశారు. స్వయంభు లక్ష్మీనరసింహులు కొలువైన ప్రధాన గర్భాలయంలో లక్ష్మీనరసింహులకు పూజలు చేసి, స్వామివారికి కంకణధారణ నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం; రాత్రి భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీ ఫాల్గుణశుద్ధ ద్వాదశి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.