Share News

యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - Feb 21 , 2025 | 05:42 AM

సరదా కోసం చేసిన సాహసం.. ఓ యువ వైద్యురాలి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువతి 20 అడుగుల ఎత్తైన రాయి మీద నుంచి తుంగభద్ర నదిలో దూకి గల్లంతై ప్రాణాలు కోల్పోయింది.

యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా

  • 20 అడుగుల రాయిపై నుంచి తుంగభద్ర నదిలో దూకిన యువతి

  • గల్లంతు.. మర్నాడు మృతదేహం లభ్యం

  • మృతురాలు మైనంపల్లి సోదరుడి కుమార్తె

అల్వాల్‌, పేట్‌బషీరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధజ్యోతి): సరదా కోసం చేసిన సాహసం.. ఓ యువ వైద్యురాలి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువతి 20 అడుగుల ఎత్తైన రాయి మీద నుంచి తుంగభద్ర నదిలో దూకి గల్లంతై ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని గంగావతి తాలుకా సణాపుర గ్రామం వద్ద తుంగభద్ర నదిలో జరిగిన ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యురాలు మైనంపల్లి అనన్యరావు(26) మరణించింది. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సోదరుడు (బాబాయి కుమారుడు) మైనంపల్లి మన్మోహన్‌రావు కుమార్తె అనన్యరావు. వీరి కుటుంబం కొంపల్లిలో నివాసముంటుంది.


హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తు న్న అనన్య తన స్నేహితులు అషిత, సాత్విక్‌తో కలిసి సోమవారం కర్ణాటకలోని హంపి విహారయాత్రకు వెళ్లారు. వీరు బుధవారం మధ్యాహ్నం తుంగభద్ర నది దగ్గరకు వెళ్లారు. అక్కడ 20 అడుగులకు పైగా ఎత్తు ఉన్న ఓ బండ రాయి మీద నుంచి అనన్య తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకింది. దూకిన కాసేపటికే అనన్య గల్లంతైంది. ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వగా బుధవారం చీకటి పడేదాకా గాలించినా.. ఆచూకీ లభించలేదు. గురువారం సాయంత్రం అనన్య మృతదేహం లభించింది. అనన్య తండ్రి మన్మోహన్‌రావు వ్యాపారవేత్త కాగా, తల్లి రజిత యోగా, ఫిట్‌నెస్‌ కోచ్‌గా పని చేస్తుంటారు. అనన్య సోదరి విదేశాల్లో ఉంటారు.

Updated Date - Feb 21 , 2025 | 05:43 AM