Share News

టెండరు ప్రక్రియను అడ్డుకోలేం

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:28 AM

కొత్వాల్‌గూడ (బుద్వేల్‌) నుంచి నేషనల్‌ హైవే 167 ఎన్‌ (నాచారం, కోస్గి / కొడంగల్‌) వరకు 81 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన రేడియల్‌ రోడ్డు ప్యాకేజ్‌-2 పనులకు సంబంధించిన టెండర్‌ వివాదంలో ఎల్‌-1 (విజయవంతమైన బిడ్డర్‌) సంస్థను కూడా ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు సూచించింది.

టెండరు ప్రక్రియను అడ్డుకోలేం
Telangana High Court

  • రేడియల్‌ రోడ్డు టెండర్ల వివాదంలో

  • ఎల్‌-1 బిడ్డర్‌ వాదన వింటాం: హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కొత్వాల్‌గూడ (బుద్వేల్‌) నుంచి నేషనల్‌ హైవే 167 ఎన్‌ (నాచారం, కోస్గి / కొడంగల్‌) వరకు 81 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన రేడియల్‌ రోడ్డు ప్యాకేజ్‌-2 పనులకు సంబంధించిన టెండర్‌ వివాదంలో ఎల్‌-1 (విజయవంతమైన బిడ్డర్‌) సంస్థను కూడా ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు సూచించింది. ఇప్పటికే టెక్నికల్‌, ప్రైస్‌ బిడ్లు తెరిచిన నేపథ్యంలో విజయవంతమైన బిడ్డర్‌తోపాటు అన్నిపక్షాల వాదనలు వింటామని పేర్కొంది. ప్రజా ప్రయోజనాల కోణంలో టెండరు ప్రక్రియను ఇప్పటికిప్పుడు అడ్డుకోలేమని స్పష్టం చేసింది. రేడియల్‌ రోడ్డు టెండర్‌కు సంబంధించి తమ టెక్నికల్‌ బిడ్‌పై అనర్హత వేటు వేయడం చెల్లదంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. తాము ఇవ్వబోయే తుది తీర్పునకు లోబడి టెండర్‌ భవిష్యత్తు ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


తాజాగా ఈ పిటిషన్‌ సోమవారం మరో సారి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయి వాదిస్తూ టెండర్‌ ఫైనల్‌ చేయకుండా హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌, గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తాము తాజాగా దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్‌పై విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఈ కోర్టుకు ఉందని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ తేరా రజినీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. ఇప్పటికే టెక్నికల్‌, ప్రైస్‌ బిడ్లు తెరిచామని, బిడ్డర్ల అర్హతలను నిబంధనల ప్రకారం అధికారులు నిర్ణయిస్తారని తెలిపారు.


ఈ దశలో టెండర్‌ ప్రక్రియలో జోక్యం చేసుకోరాదని కోరారు. అధికారులు దురుద్దేశంతో వ్యవహరించినట్లు ఎలాంటి ఆరోపణలు రాలేదని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వివాదం పిటిషనర్‌ కంపెనీ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ చెల్లుబాటు, దానిపై సంతకం చేసిన అధికారి హోదాకు సంబంధించినదని, ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని తెలిపింది. ఎల్‌-1 బిడ్డర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాలని, ప్రతివాదులు రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌-1 వాదన విన్న తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఉపాధి కోసం వెళ్లి..మృత్యువుతో పోరాటం

దొరికిపోతాననే భయంతో చంపేశాడు

ప్రజల కోసమే ఢిల్లీ వీధుల్లో రాహుల్‌ పోరాటం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 05:28 AM