Kadapa: కడప జిల్లా ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో కొట్టబోతోందంటే..

ABN , First Publish Date - 2022-12-12T15:03:23+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్‌ మూడున్నరేళ్ల పాలనపై జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం బటన్‌ వత్తుడు కార్యక్రమాన్ని పరిపాలన అంటూ జగన్‌ భావిస్తున్నట్లు విమర్శిస్తున్నారు. నవరత్నాల భారం తగ్గించుకునేందుకు..

Kadapa: కడప జిల్లా ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని స్థానాల్లో కొట్టబోతోందంటే..

సీఎం వైఎస్‌ జగన్‌ మూడున్నరేళ్ల పాలనపై జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం బటన్‌ వత్తుడు కార్యక్రమాన్ని పరిపాలన అంటూ జగన్‌ భావిస్తున్నట్లు విమర్శిస్తున్నారు. నవరత్నాల భారం తగ్గించుకునేందుకు రకరకాల కొర్రీలు వేసి ప్రతి యేటా అర్హుల జాబితాను తగ్గిస్తున్నారని అంటున్నారు. సంక్షేమ పథకాల కోతలపై ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యమంటూ జగన్‌ ముందుకు వెళుతున్నారు. ప్రతి చోటా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేస్తున్నారు. పనితీరు బాగా లేని వారికి టికెట్లు ఇవ్వనని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది, పీకే సర్వేలో ఎవరెవరు వెనుకబడ్డారు.. అలాంటి చోట కొత్త అభ్యర్థులు ఎవరంటూ వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది.

(కడప - ఆంధ్రజ్యోతి): కడప జిల్లా అంటేనే జగన్‌ సామ్రాజ్యం. అందుకు తగ్గట్లుగానే గత ఎన్నికల్లో కూడా జిల్లావాసులు వైఎస్‌ కుటుంబానికే పట్టంకట్టారు. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లోనూ వైసీపీ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఉమ్మడి జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేయాలనే ఉద్దేశ్యంతో వైసీపీ ఉన్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అంత సీన్‌ లేదని సర్వేలో పెద్దలకు అర్థమవుతోందని సమాచారం. పలు నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉందని తెలిసిపోయింది. కడప జిల్లాలో ప్రస్తుతం 1999కి ముందు పరిస్థితి ఉందని ఆ మేరకు సగానికి పైగా స్థానాలను టీడీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లు వైసీపీకి ఫీడ్‌బ్యాక్‌ వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లలో ఎవరెవరికి టికెట్లు దొరుకుతాయన్న ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతోంది. పులివెందుల మినహా ఎక్కడే కానీ ఎవరికీ టికెట్‌ కన్‌ఫర్మ్‌ అనే భరోసా లేదని వైసీపీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే పీకే టీం సర్వేలో తెలిసిన మేరకు సొంత జిల్లాలో కూడా జగన్‌ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని తమ పార్టీలో చర్చించుకుంటున్నారని ఓ వైసీపీ నేత వ్యాఖ్యానించారు.

కడపలో ఆశావహులు ఎందరో..

కడప అసెంబ్లీ నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కార్పొరేటరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. అయితే కడప సీటుపై మేయరు సురేశ్‌బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీలోనే బీసీ సామాజిక వర్గంలో సురేశ్‌బాబు కీ రోల్‌గా ఉన్నారు. చిన్నచౌకు పంచాయతీలోని ఆయన కుటుంబీకులే ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్లుగానూ పనిచేసేవారు. సురేశ్‌బాబు సైతం రెండుసార్లు కడప మేయరుగా పనిచేశారు. ఈయన కడప ఎమ్మెల్యే టికెట్‌ కోసం చాలా ఏళ్లు ప్రయత్నించారని అంటున్నారు. 2019 ఎన్నికల్లో టికెట్‌ ఆశించినప్పటికీ మైనార్టీ కోటాలో సర్దుబాటు కారణంగా కడప టికెట్‌ అంజద్‌బాషాకు ఇచ్చేసి, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చినట్లు సురేశ్‌బాబు వర్గీయులు చెబుతుంటారు. ప్రభుత్వం వచ్చిన తరువాత ఈసారి మేయరుగా పనిచేయాలి, నెక్ట్స్‌ అవకాశం ఇస్తానని జగన్‌ చెప్పారని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సురేశ్‌ బాబు ఆశిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కడప సీటు మైనార్టీలకు ఇవ్వకుంటే తాను లేదా తన కొడుకు ఇక్కడి నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఉన్నట్లు ప్రచారం ఉంది. కడప మేయరుగా ఈయన పనిచేశారు. ఆయనకు కూడా ఎప్పటినుంచో కడపపై ఆసక్తి ఉంది. కమలాపురంలో కూడా కొత్త వ్యక్తి వస్తారన్న ప్రచారం ఉంది.

ఇక దివంగత మాజీ మంత్రి ఖలీల్‌బాషా కుమారుడు సొహైల్‌ కూడా కడప టికెట్‌పై ఆశ పెట్టుకున్నట్లు ప్రచారం ఉంది. జగన్‌ ప్రభుత్వంలో ఇటీవల నెం.2గా వ్యవహరిస్తున్న జిల్లాకు చెందిన ముఖ్య నేత హామీ ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ అతనికే అని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు వైసీపీలో టికెట్‌ తనకు తప్ప ఎవరికీ లేదని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ధీమాగా ఉన్నారు.

బద్వేలు బరిలో..

బద్వేలు ఎస్సీ నియోజకవర్గం. అక్కడ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి చెందడంతో ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి సుధ గెలుపొందారు. పార్టీ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే కడపలో పనిచేస్తున్న ఓ అధికారి తన సతీమణిని బద్వేలు బరిలో దింపాలని భావిస్తున్నారు. ఆయన సతీమణికి జగన్‌ కుటుంబ సభ్యులకు మంచి స్నేహం ఉందని, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ తమదే అని చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి అనుచరుడుగా ముద్రపడ్డ పులి సునీల్‌కుమార్‌ కూడా టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు.

మైదుకూరులో..

మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి వయోభారం కారణంగా ఈసారి టికెట్‌ మార్పు అన్న ప్రచారం ఉంది. ఆయన కొడుకుకు ఇస్తున్నట్లు కొందరు అంటుండగా మరికొందరు మాత్రం అదే మండలంలోని మరొకరికి ఇస్తున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ టీడీపీ బీసీలకు ఇవ్వడంతో అదే సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరిలో నిలుపుతారనే ప్రచారం ఉంది.

ప్రొద్దుటూరులో..

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి టికెట్‌ తనకే అన్న ధీమాతో ఉన్నారు. కొందరు స్థానిక వైసీపీ నేతలకు ఆయనకు కుదరడంలేదు. ఆయన వ్యతిరేక వర్గం వేరే వర్గానికి టికెట్‌ ఇవ్వాలంటూ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. కొందరు బీసీలు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం ఉంది.

జమ్మలమడుగులో..

జమ్మలమడుగు టికెట్‌పై కొందరు కన్నేసినట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త దుశ్యంత్‌ ఈసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం వైసీపీలో ఉంది. ప్రస్తుతం అక్కడున్న గ్రూపు రాజకీయాలు కూడా పలు చర్చలకు తావిస్తోంది.

ఇవన్నీ కేవలం ప్రచారం మాత్రమే. అయితే పీకే టీం ఇచ్చే సర్వే రిపోర్టు, జగన్‌ సొంత నిఘా వర్గాల నివేదిక మేరకే టికెట్ల మార్పిడి వ్యవహారం ఉంటుందంటున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే మార్చేస్తానని జగన్‌ నాలుగు నెలల కిందటనే ఖరారుగా చెప్పారు. సొంత జిల్లాలో జగన్‌ను చూసైనా తమపై వ్యతిరేకత ఉండదని ఇప్పటిదాకా సిట్టింగ్స్‌ భావిస్తూ వచ్చారు. అయితే పలు సర్వేల్లో కొందరిపై వ్యతిరేకత వచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సిట్టింగ్‌లలో ఎవరికి టికెట్లు ఉంటాయనే చర్చ నడుస్తోంది.

Updated Date - 2022-12-12T15:03:48+05:30 IST