Sajjala Ramakrishna Reddy: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-12-05T13:17:08+05:30 IST

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Sajjala Ramakrishna Reddy: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల ఏమన్నారంటే...

అమరావతి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Government Advisor Sajjala Ramakrishna Reddy)స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఒక ప్రభుత్వ విభాగంలో కొద్దిమంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు వచ్చాయని... దీనిపై సీఎం జగన్ (Andhrapradesh CM YS Jagan mohan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరింపజేయాలని సీఎం ఆదేశించిన్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ విభాగంలోనూ పొరుగు సేవల సిబ్బంది తొలగించారన్న అంశంపైనా విచారణ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరినీ తొలగించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.

ఆ ప్రచారం సరికాదు...

రాయలసీమకు వైఎస్ జగన్ అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేయడం సరికాదన్నారు. రాయలసీమకు వైఎస్‌ఆర్ సహా జగన్ ఏం చేశారనే విషయం అక్కడి ప్రజలకు తెలుసని అన్నారు. రాయలసీమకు శ్రీశైలం నుంచి వరద జలాలు ఇవ్వాలని కాలువల వెడల్పు చేపట్టారని తెలిపారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు లిఫ్ట్ చేసేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు మూడు టీఎంసీలు లిఫ్టింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఎన్జీటీలో కేసు వేసి చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. హంద్రీనీవా, వెలిగొండ పనులను సీఎం జగన్ పూర్తి చేస్తున్నారన్నారు. కుప్పం బ్రాంచి కెనాల్‌ను కూడా చంద్రబాబు పూర్తి చేయకపోతే వైఎస్ జగన్ పూర్తి చేశారని తెలిపారు. ఐదు మెడికల్ కళాశాలు, కాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లు రాయలసీమకు వస్తున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారకుడని ఆరోపించారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు ...పోలవరం పూర్తి చేసేది లేదన్నారు. ఇప్పటికి రాజధాని, హైకోర్టు అమరావతిలోనే ఉందన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలన్నది వైసీపీ విధానమని తెలిపారు. రాష్ట్రంలో మూడు రాజధానులు రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్‌లో చంద్రబాబు, లోకేష్ పాత్ర లేకుండా అవకతవకలు జరిగి ఉండన్నారు. అవకతవకల్లో ఎవరెవరు ఉంటే అందరిపై చర్యలు తప్పవని సజ్జల పేర్కొన్నారు.

Updated Date - 2022-12-05T13:17:09+05:30 IST