YCP Leaders: కమిటీ హాల్ కబ్జా చేసి... పందెం కోళ్లతో వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2022-11-11T15:10:48+05:30 IST
రాష్ట్రంలో రోజురోజుకీ వైసీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.
ఏలూరు: రాష్ట్రంలో రోజురోజుకీ వైసీపీ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా వైసీపీ నాయకులు ఎక్కడకక్కడ దాడులకు తెగబడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుకుంటలో ఓ వైసీపీ నాయకుడి ఆగడాలు మితిమిరాయి. ప్రభుత్వ స్థలంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌ను కబ్జా చేశాడు. అంతటితో ఆగకుండా అదే స్థలంలో దర్జాగా పందెం పుంజుల పెంపకాన్ని చేపట్టాడు. ఇదేంటని అడిగిన వారిపై దాడులకు తగబడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాడు. అయితే ఇంత జరుగుతున్నప్పటీ అధికారులు గానీ, అధికార పార్టీ నేతలు గాని పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
స్థానిక పంచాయతీలో 7వ వార్డు మెంబర్ కుమ్మరి రమేష్ స్థానిక ఎస్సీ పేటలో కమిటీ హాల్, అలాగే దాని చుట్టూ ఉన్న స్థలాన్ని కబ్జా చేశారు. ఆ స్థలం చుట్టూరు గ్రీన్ మ్యాట్ కట్టి అందులో పందెం పుంజులను పెంచుతున్నారు. ఎవరైనా ఇదేమిటి అని అడగడానికి వెళితే ‘‘నేను అధికార పార్టీ నాయకుడిని, నన్ను ఎవరు ఏమీ చేయలేరని, మీ దిక్కున చోట చెప్పుకోండి’’ అంటూ బెదిరిస్తూ దాడులకు తెగబడుతున్నారు. పంచాయతీకి చెందిన ప్రభుత్వ స్థల కబ్జాపై స్థానిక పంచాయతీ సెక్రటరీ, సర్పంచుకు ఫిర్యాదు చేసినప్పటికీ వారెవరు కనీసం అటువైపుగా కూడా రాని పరిస్థితి. తప్పని చెప్పాల్సిన అధికార పార్టీ నేతలు కూడా అతనికి అండదండలు ఇస్తూ స్థానికులను భయాందోళన గురి చేస్తున్నారు.