Governor వర్సెస్‌ Government ఘర్షణ ఎందుకు!?

ABN , First Publish Date - 2022-12-29T14:30:09+05:30 IST

దేశం (India)లో గవర్నర్ల (Governor) వ్యవస్థ రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. రాష్ర్టాల్లో గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ (Government) మధ్య ఘర్షణ పెరుగుతోంది. కేంద్ర

Governor వర్సెస్‌ Government ఘర్షణ ఎందుకు!?
ఘర్షణ ఎందుకు!?

దేశం (India)లో గవర్నర్ల (Governor) వ్యవస్థ రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. రాష్ర్టాల్లో గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ (Government) మధ్య ఘర్షణ పెరుగుతోంది. కేంద్ర, రాష్ర్టాల్లో విభిన్న ప్రభుత్వాలున్నప్పుడు ఈ ఘర్షణ అనివార్యమౌతోంది. కేరళ, వెస్ట్‌ బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణ(Telangana) ఇలా ఒక్కో రాష్ట్రంలో గవర్నర్‌ వ్యవస్థ వివాదం అవడంతో దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కేంద్రస్థాయిలో భారత రాష్ట్రపతికి సమానమైన అధికారాలు, విధులు రాష్ట్ర స్థాయిలో గవర్నర్లు కలిగి ఉన్నారు. రాష్ర్టాలలో గవర్నర్లు, నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీతో సహా కేంద్ర భూభాగాల్లో లెఫ్టినెంట్‌ గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్‌ ఉన్నారు. గవర్నర్‌ నామమాత్రపు అధిపతిగా వ్యవహరిస్తారు, అయితే నిజమైన అధికారం రాష్ర్టాలలో రాష్ర్టాల ముఖ్యమంత్రులు, వారి మంత్రిమండలిపై, కేంద్ర పాలితప్రాంతాల్లో, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేదా నిర్వాహకుడి(అడ్మినిస్ట్రేటర్‌) వద్ద ఉంది. ఢిల్లీ, పుదుచ్చేరి మినహా, గవర్నరు ఒక ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రుల మండలితో అధికారాన్ని పంచుకుంటారు. ఆర్టికల్‌ 153 ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఓ గవర్నర్‌ అవసరం. గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లను ఐదేళ్ల కాలానికి భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్‌ 154 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కి కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. పరోక్షంగా అధికారుల ద్వారా పరిపాలన చేయవచ్చనేది దీనర్థం. గవర్నర్‌ వ్యవస్థ అనేది స్వాతంత్ర్యానికి పూర్వం అంటే బ్రిటీష్‌ పాలన (British rule) నుంచి ఉన్నది. అప్పట్లో వైశ్రాయ్‌ కీలకమైన పదవి. గవర్నర్‌ కేవలం కార్య నిర్వాహక అధిపతి. బ్రిటీష్‌ చట్టాలకు అనుగుణంగా నాడు ఏర్పడిన ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గవర్నర్‌ వ్యవస్థ వారధిలా ఉండాలనే ఉద్దేశంతో కొనసాగిస్తున్నారు. కానీ ఇదే గవర్నర్‌ వ్యవస్థను ఆసరా చేసుకుని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ర్టాలపై ఆధిపత్యం చెలాయించిన సందర్భాలున్నాయి. రాష్ట్రప్రభుత్వం ఓ బిల్లును ఆమోదించినప్పుడు స్పష్టత కోరే అధికారం గవర్నర్‌కు ఉంది. అయినా ఆ బిల్లును అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే.

  • దేశంలో గవర్నర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. చాలా రాష్ర్టాల్లో గతంలో ఇలాంటి వివాదాలు తారాస్థాయికి చేరి విమర్శలు దాటి ధర్నాలు, రాస్తారోకోలు చేసుకునే వరకు కూడా వెళ్లాయి. అయితే, కొద్ది రోజుల క్రితం వరకు పుదుచ్చేరిలో కిరణ్‌బేడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం పూర్తిగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యవస్థనే వ్యతిరేకించింది. కిరణ్‌ బేడికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక, ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ వర్సెస్‌ అక్కడి గవర్నర్‌ మధ్య వివాదం గతంలో నిత్యకృత్యంలా మారింది.

  • ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ర్టాలకు సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడిగా రామ్‌లాల్‌ పేరును చెబుతుంటారు. 1984లో కాంగ్రెస్‌ సభ్యుడు రామ్‌ లాల్‌ గవర్నర్‌గా ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని తొలగించి, నాదెండ్ల భాస్కరరావును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అనుమతించారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన గవర్నర్‌గా ఆయన చరిత్రకెక్కారు. తరవాత కుముద్‌బెన్‌ జోషి గవర్నర్‌గా ఉన్నప్పుడూ నాటి ఎన్టీఆర్‌ ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదించి వార్తల్లో నిలిచారు. రాజ్‌భవన్‌లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. సీఎం ఎన్టీఆర్‌, కుముద్‌బెన్‌ మధ్య కొంతకాలం కోల్డ్‌వార్‌ సాగింది.

  • ఈ వివాదాల నేపథ్యంలో గతంలో మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చందూ సంచలన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. గవర్నర్‌ పదవి అనవసరమైందని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభు త్వం రూపొందించిన ముసాయిదా బిల్లుల్ని గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టడం ఏ మేరకు సమంజసమనేది జస్టిస్‌ చందూ వాదన. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు గవర్నర్‌ వ్యవస్థ అవసరమా అని ప్రశ్నించారు.

  • గవర్నర్‌ పదవిని ‘‘ఖరీదైన వృద్థాప్య గృహాలు’’గా రాజకీయ పరిశీలకులు అభివర్ణించారు ఎందుకంటే కొన్ని సందర్భాలలో గవర్నర్‌ నిష్పాక్షికంగా ఉండటం లేదు.

  • గవర్నర్‌ రాష్ట్రప్రభుత్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి. రాజ్యాంగంలో అత్యంత వివాదాస్పదం అయినదిగా గవర్నర్‌ పదవి సమాఖ్య వ్యవస్థకు విరుద్ధమైనదిగా పేర్కొంటారు. గవర్నర్‌ విచక్షణాధికారాలు, తన నియామకం, కాలపరిమితి, తొలగింపు ఈ పదవి వివాదాస్పదం అవడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా 1967 తరవాత దేశంలోని ఎనిమిది రాష్ర్టాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కేంద్రప్రభుత్వం గవర్నర్‌ని తన ఏజెంట్‌గా పరిగణించడం సర్వసాధారణమైంది. కేంద్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి రాష్ర్టాల్లో గవర్నర్లను మార్చడం, ఇష్టానుసారంగా గవర్నర్లను మార్చపయోగించుకొనేట్లు ఆజ్ఞాపించడం వంటి చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు గవర్నర్‌ వ్యవస్థే ఇబ్బందికరంగా మారింది.

  • గవర్నర్‌ పదవి వివాదాస్పదం కాకూడదంటే కొన్ని మార్పులు తప్పనిసరి అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నా యి. రాజకీయ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తిని కాకుండా ప్రజా పరిపాలన రంగంలో నిష్ణాతులైన వ్యక్తులను నియమించడం, గవర్నర్‌ని నియమించే ముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ సలహా కోరడం, సమకాలీన రాజకీయాలల్లో క్రియాశీలకంగా ఉండని వ్యక్తిని నియమించాలని సూచించిన సర్కారియా, పూంచీ కమిషన్‌ సిఫార్సులను పాటించే విధంగా ఉంటే బాగుంటుంది. రాష్ట్రపతిని ఎలా అయితే తొలగించడానికి మహాభియోగ తీర్మానం ఉందో అలాంటి పద్ధతిని గవర్నర్‌ విషయంలో తీసుకురావడం, గవర్నర్‌కు పదవీకాలం భద్రత కల్పిస్తే సమాఖ్య లక్షణాలున్న భారత దేశాన్ని సహకార సమాఖ్య గల దేశంగా చూస్తారనడంలో అవాస్తవంలేదు.

    M.BALALATHA.gif

- ఎం.బాలలత, సివిల్స్‌ మెంటార్‌

Updated Date - 2022-12-29T14:30:11+05:30 IST