Gujarat : మోదీ, షాల అడ్డాలో బీజేపీకి పోటీ ఎవరో తేలిపోయింది!

ABN , First Publish Date - 2022-12-08T13:41:07+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ల స్వరాష్ట్రం గుజరాత్‌లో

Gujarat : మోదీ, షాల అడ్డాలో బీజేపీకి పోటీ ఎవరో తేలిపోయింది!
Narendra Modi, Amit Shah

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)ల స్వరాష్ట్రం గుజరాత్‌లో బీజేపీకి పోటీ ఎవరో తాజా శాసన సభ ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. 182 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 154 స్థానాల్లో ఆధిక్యంతో ఆ పార్టీ దూసుకుపోతోంది. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 6 స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో గుజరాత్‌లో బీజేపీని ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని అర్థమవుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. 2002లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో జరిగిన ఎన్నికల్లో 127 స్థానాలను దక్కించుకుని బీజేపీ రికార్డు సృష్టించింది. ఆ రికార్డును ఇప్పుడు ఆ పార్టీ చెరిపేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆల్-టైమ్ హై రికార్డు మాత్రం కాంగ్రెస్ పేరు మీద ఉంది.

1985లో మాధవ్ సింహ్ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్ 149 స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించింది. తాజా ఎన్నికల్లో ఆధిక్యంలో కనిపిస్తున్న స్థానాలన్నిటిలోనూ బీజేపీ గెలవగలిగితే ఈ రికార్డును కూడా తుడిచిపెట్టేసే అవకాశం ఉంది. 1995 నుంచి జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా గెలుస్తుండటం బీజేపీ చరిత్రలో మరొక రికార్డు.

పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం వరుసగా ఏడుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించింది. 1977 నుంచి 2011 వరకు 34 ఏళ్ళపాటు ప్రభుత్వాన్ని నడిపింది. 2022 గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, వరుసగా ఏడుసార్లు గెలిచిన సీపీఎం రికార్డును బీజేపీ సమం చేస్తుంది. అయితే బీజేపీ వరుసగా 27 సంవత్సరాల నుంచి గుజరాత్‌లో అధికారంలో ఉంది. 2022 నుంచి 2027 వరకు పదవీ కాలం పూర్తయ్యే సరికి మొత్తం 32 ఏళ్లు అవుతుంది. ఎనిమిదోసారి కూడా గెలిస్తేనే వరుసగా 34 ఏళ్ళపాటు పరిపాలించిన సీపీఎం రికార్డును అధిగమించే అవకాశం ఉంటుంది.

Updated Date - 2022-12-08T13:41:12+05:30 IST