Sanjay Raut: మూడున్నర నెలల తర్వాత ఎట్టకేలకు బెయిల్
ABN , First Publish Date - 2022-11-09T14:39:36+05:30 IST
ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ప్రత్యేక కోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. శివసేన రాజ్యసభ సభ్యుడుగా, ఫైర్‌బ్రాండ్ నేతగా పేరున్న సంజయ్ రౌత్..
ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut)కు ప్రత్యేక కోర్టు బుధవారంనాడు బెయిల్ (Bail) మంజూరు చేసింది. శివసేన రాజ్యసభ సభ్యుడుగా, ఫైర్‌బ్రాండ్ నేతగా పేరున్న సంజయ్ రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. బెయిలు దరఖాస్తుపై రౌత్, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు అక్టోబర్ 21న తీర్పు రిజర్వ్ చేసింది.
ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీ రీడవలప్‌మెంట్ వ్యవహారంలో అవకతవకల ఆరోపణలకు సంబంధించి సంజయ్ రౌత్‌ను గత ఆగస్టు 1న ఈడీ కస్టడీలోకి తీసుకుంది. మనీలాండరింగ్ చట్టం కింద అరెస్టు కావడానికి ముందు ఆయన రెండుసార్లు ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు బనాయించినట్టు రౌత్ మొదట్నించీ చెబుతున్నారు. శివసేన పార్టీ తమదేనంటూ ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య పోరు జరుగుతున్న తరుణంలో రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. షిండే క్యాంపు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడాన్ని రౌత్ ఎండగడుతూ వచ్చారు. రౌత్ అరెస్టు అనంతరం ముఖ్యమంత్రి షిండే సైతం తనదైన శైలిలో స్పందించారు. రౌత్ అమాయకుడైతే ఈడీ విచారణకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అర్ధరాత్రి సమయంలో రౌత్‌ను అరెస్టు చేయడాన్ని ఉద్ధవ్ థాకరే ఖండిస్తూ, రౌత్‌ను చూసి తమకు గర్వంగా ఉందని అన్నారు. రాజకీయ ప్రతీకార చర్యలతోనే అరెస్టులు జరుగుతున్నాయని, తమపై కుట్రలు జరిపే వారి ఆటలు కట్టిస్తామని అన్నారు. ఈడీ చర్యను కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఖండించాయి. రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని ఈడీని బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వం ఉసిగొలుపుతోందని ఆ పార్టీలు ఆరోపించాయి.