Bihar CM Nitish Kumar: రాహుల్ ప్రధాని అభ్యర్ధిత్వంపై నితీశ్ మెలిక
ABN , First Publish Date - 2022-12-31T16:54:14+05:30 IST
ప్రధానమంత్రి అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మద్దతిచ్చే విషయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar ) అభ్యంతరం లేదంటూనే మెలిక పెట్టారు.
పాట్నా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మద్దతిచ్చే విషయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar ) అభ్యంతరం లేదంటూనే మెలిక పెట్టారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసే పార్టీల నేతలంతా కూర్చుని చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. పాట్నాలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ సమాధానం చెప్పారు. అయితే రాహుల్‌కు పూర్తి స్థాయిలో మద్దతిస్తామని నితీశ్ విస్పష్టంగా చెప్పలేకపోయారు. అంతేకాదు భారత్ జోడో అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినదని తేల్చి చెప్పారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటారా అని విలేకరులు అడగ్గా చర్చించుకుని ఏం చేయబోతున్నామో చెబుతామన్నారు.
2024 ప్రధాని అభ్యర్ధిత్వం ఆశిస్తున్న నితీశ్
2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్ధిగా ఉండాలని నితీశ్ కుమార్ కోరుకుంటున్నారని సమాచారం. దీనిపై ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. జాతీయ మీడియా ఆయన్ను కూడా విపక్షాల ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారం చేస్తోంది. బీజేపీయేతర పార్టీల నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్ యత్నిస్తున్నారు. ఇప్పటికే మంతనాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్జేడీ-కాంగ్రెస్‌తో కలిసి మహాఘట్ బంధన్ పేరుతో బీహార్‌లో సంకీర్ణ సర్కారు నడుపుతోన్న నితీశ్ కాంగ్రెస్ అధిష్టానంతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శివసేన ఉద్ధవ్ గ్రూప్ అధినేత ఉద్ధవ్ థాకరే తదితరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేసీఆర్ స్వయంగా పాట్నా వెళ్లి నితీశ్‌తో చర్చలు జరిపారు. కేసీఆర్ కలిసిన నాటి నుంచీ బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు నితీశ్ యత్నాలు ముమ్మరం చేశారు. ఆ తర్వాతే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపారు. అయితే కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అనుకూల కూటమిలో ఉంటారా లేదా అనేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తేలనుంది.
బీజేపీయేతర పార్టీల నేతల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా విపక్షాల ప్రధాని అభ్యర్ధిత్వం కోరుకుంటున్నారు. ముగ్గురూ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో సమర్థించడం లేదు.
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్షాల ప్రధాని అభ్యర్ధిత్వం కోరుకునే నేతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ మరోసారి వచ్చి హ్యాట్రిక్ విజయం సాధిస్తే ప్రధాని అభ్యర్ధిత్వం కోరుకునే విపక్ష నేతలకు నిరాశ తప్పదు.