Amit sha: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-12-31T20:16:35+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను...

Amit sha: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీకి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Sha) కీలక ప్రకటన చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ (Bjp) ఒంటరిగానే ఎదుర్కొంటుందంటూ పార్టీ నిర్ణయాన్ని తెలియజేశారు. జేడీ(ఎస్)తో మాటలు జరుగుతున్నాయనే వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు.

''జేడీ(ఎస్)తో అనుబంధం ఉన్న కొందరు ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని వదంతులు ప్రచారం చేస్తున్నారు. దీనికి చాలా స్పష్టంగా సమాధానం చెబుతున్నాను. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది'' అని బెంగళూరులో శనివారం జరిగిన సెంట్రల్ డెటిక్టివ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఐటీబీబీ ప్రారంభోత్సవ కార్యక్రంలో ఆయన చెప్పారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, అవినీతికి పాల్పడటం కోసం అధికారాన్ని కాంగ్రెస్ కోరుకుంటుందని, తాము (బీజేపీ) మాత్రం ప్రజలకు మరింత మెరుగైన జీవనం కల్పించాలని కోరుకుంటామని చెప్పారు. ఇటీవల 7 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 5 రాష్ట్రాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 6 రాష్ట్రాల్లో పత్తాలేకుండా పోయిందని అన్నారు.

అంగుళం భూమి కూడా ఎవరూ ఆక్రమించలేరు..

ఇండో-టిబెట్ సరిహద్దు పోలీసుల (ఐటీబీపీ) సేవలను హోం మంత్రి శ్లాఘించారు. హిమవీరులుగా వారిని అభివర్ణించారు. ఐటీబీపీ సరిహద్దుల్లో ఉన్నంత వరకూ ఒక్క అంగుళం భూమిని కూడా ఎవరూ ఆక్రమించుకోలేరన్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లోనూ సరిహద్దులను కావలి కాస్తున్న హిమవీరులు వారని అన్నారు. ఇది పద్మశ్రీ, పద్మభూషణ్ కంటే పెద్ద టైటిల్ అని అన్నారు.

Updated Date - 2022-12-31T20:16:37+05:30 IST