CM of Himachal Pradesh : బస్ డ్రైవర్ కుమారుడు.. హిమాచల్ సారథి
ABN , First Publish Date - 2022-12-12T05:35:54+05:30 IST
సాధారణ బస్సు డ్రైవర్ కుమారుడు ఓ రాష్ట్రానికి సీఎం అయ్యారు. అంచలంచెలుంగా ఎదిగి పాలనా పగ్గాలు చేపట్టారు. అగ్ర నేతల హాజరు మధ్య హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ సీఎంగా సుఖ్విందర్ ప్రమాణం
డిప్యూటీగా ముఖేష్ అగ్నిహోత్రి మాత్రమే
4 దశాబ్దాల అనంతరం సీఎంగా కొత్త ముఖం
రాహుల్, ప్రియాంక హాజరు.. మోదీ కంగ్రాట్స్
శిమ్లా, డిసెంబరు 11: సాధారణ బస్సు డ్రైవర్ కుమారుడు ఓ రాష్ట్రానికి సీఎం అయ్యారు. అంచలంచెలుంగా ఎదిగి పాలనా పగ్గాలు చేపట్టారు. అగ్ర నేతల హాజరు మధ్య హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని శిమ్లాలోని రిడ్జ్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుఖుతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ముఖేష్ అగ్నిహోత్రి (60) డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్ సీఎంలు అశోక్ గెహ్లోత్, భూపేష్ భగేల్, సీఎం పదవి ఆశించిన పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు. సుఖుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సాధ్యమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, విక్రమాదిత్యకు చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి ముందు సుఖ్వీందర్.. ప్రతిభ నివాసానికి వెళ్లి ఆమెను ఆహ్వానించారు. మరోవైపు ప్రమాణ స్వీకార వేదికపై ప్రతిభను రాహుల్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆమెతో ప్రియాంక ముచ్చటించారు. సుఖును సీఎం చేయడం, ప్రతిభను గౌరవించడం, ముఖే్‌షను డిప్యూటీ సీఎంగా చేయడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ ఏకతాటి మీద ఉన్నట్లు చాటేందుకు అగ్ర నేతలు ప్రయత్నించారు.
హిమాచల్ కాంగ్రె్‌సలో కొత్త తరం
సుఖు.. హిమాచల్ ప్రదేశ్‌కు 15వ ముఖ్యమంత్రి. ఐదు దశాబ్దాల పాటు రాష్ట్ర కాంగ్రె్‌సలో తిరుగులేని ఆధిపత్యం సాగించిన.. నాలుగు దశాబ్దాల్లో అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన వీరభ్రదసింగ్ కుటుంబానికి కాకుండా సీఎం పదవిని సుఖ్వీందర్‌కు ఇవ్వడంతో ఆ రాష్ట్రంలో కొత్త నాయకత్వ శకం ప్రారంభమైనట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోమైపు ఇప్పటివరకు కాంగ్రెస్ సీఎంలుగా పనిచేసిన వారంతా అప్పర్ హిమాచల్‌కు చెందినవారు కాగా సుఖ్వీందర్ మాత్రం లోయర్ హిమాచల్ వాసి. కాగా, అంతకుముందు సుఖు ప్రమాణ స్వీకారానికి ప్రతిభ హాజరుపై కొంత సందిగ్ధత నెలకొంది. దీనికి తెరదించుతూ ఆమె పాల్గొన్నారు. తన కుమారుడికి మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చెప్పారు.