Rajiv Gandhi Case: రాజీవ్ హంతకుల విడుదలపై కాంగ్రెస్ స్పందన
ABN , First Publish Date - 2022-11-11T15:36:51+05:30 IST
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న
న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులందరినీ విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తీర్పు దురదృష్టకరమని, ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఈ తీర్పుతో తమిళనాడులోని జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు విడుదల కాబోతున్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) శుక్రవారం మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ హత్య కేసులో మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యం కాదని, పూర్తిగా తప్పు అని తెలిపింది. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విమర్శిస్తోందని, ఇది విమర్శల నుంచి తప్పించుకోజాలని తీర్పు అని చెప్పారు. ఈ అంశంలో భారతీయ ఆత్మకు అనుగుణంగా సుప్రీంకోర్టు ప్రవర్తించకపోవడం చాలా దురదృష్టకరమని చెప్పారు.
రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో 1991 మే 21న హత్యకు గురైన సంగతి తెలిసిందే. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (LTTE) ఆత్మాహుతి బాంబర్ ఆయనను హత్య చేసింది. ఈ కేసులో ఆరుగురు దోషులు ప్రస్తుతం తమిళనాడులోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరు దాదాపు 33 ఏళ్ళ నుంచి జైలులో ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. వీరంతా జైలులో మంచి నడవడికతో ప్రవర్తించారని, అంతేకాకుండా వేర్వేరు డిగ్రీలు సాధించారని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది.
మరొక దోషి ఏజీ పెరరివలన్‌ను సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను వినియోగించి మే నెలలో విడుదల చేసింది. ఈ తీర్పును మిగిలిన ఆరుగురు దోషులకు వర్తింపజేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది.