Musk Vs Trump : ఎలన్ మస్క్‌కు షాక్ ఇచ్చిన ట్రంప్

ABN , First Publish Date - 2022-11-20T12:24:14+05:30 IST

సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమం ట్విటర్ నూతన యజమాని ఎలన్ మస్క్ (Elon Musk)కు అమెరికా మాజీ

Musk Vs Trump : ఎలన్ మస్క్‌కు షాక్ ఇచ్చిన ట్రంప్
Donald Trump

వాషింగ్టన్ : సోషల్ నెట్‌వర్కింగ్ మాధ్యమం ట్విటర్ నూతన యజమాని ఎలన్ మస్క్ (Elon Musk)కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గట్టి షాక్ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ట్రంప్ ట్విటర్ ఖాతాను మస్క్ పునరుద్ధరించగా, మళ్లీ ఆ వేదికపైకి వెళ్ళాలనే ఆసక్తి తనకు లేదని ట్రంప్ చెప్పారు. తాను తన సొంత వేదిక ట్రూత్ సోషల్‌లోనే ఉంటానని చెప్పారు.

2021 జనవరి 6న అమెరికా కేపిటల్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో జరిగిన ఈ హింసాకాండ నేపథ్యంలో ఆయన ట్విటర్ ఖాతాపై ఆ కంపెనీ నిషేధం విధించింది. దీంతో ఆయన సొంతంగా ట్రూత్ సోషల్ అనే సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌ను రూపొందించుకుని, ఉపయోగిస్తున్నారు.

ట్విటర్‌ నూతన యజమాని ఎలన్ మస్క్ గతంలో నిషేధానికి గురైన కొన్ని ట్విటర్ ఖాతాలను పునరుద్ధరించారు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? చెప్పాలని ఓ పోల్‌ను నిర్వహించారు. సుమారు 15 మిలియన్ల మంది ట్విటర్ యూజర్లు తమ అభిప్రాయాన్ని తెలిపారు. వీరిలో 51.8 శాతం మంది ట్రంప్‌నకు అనుకూలంగా ఓటు వేశారు. ఆయన ఖాతాను పునరుద్ధరించాలని కోరారు. దీంతో ట్రంప్ ట్విటర్ అకౌంట్‌ను పునరుద్ధరించారు. 22 నెలలపాటు నిషేధానికి గురైన ఈ ఖాతా మళ్లీ అందుబాటులోకి వచ్చింది.

ఎలన్ మస్క్ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారని చెప్పారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.

అయితే ట్రంప్ మళ్లీ ట్విటర్ వేదికపైకి వెళ్లేందుకు ఆసక్త చూపడం లేదు. మళ్లీ ట్విటర్‌కు వెళ్లేందుకు తగిన కారణం ఏదీ కనిపించడం లేదన్నారు. తాను తన ట్రూత్ సోషల్ (Truth Social)కే పరిమితమవుతానని చెప్పారు. ట్విటర్ కన్నా ట్రూత్ సోషల్ మెరుగైన వేదిక అని చెప్పారు. ఇది అద్భుతంగా పని చేస్తోందన్నారు. దీనిని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ తయారు చేసింది. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు. గతంలో ట్రంప్ మాట్లాడుతూ, ఎలన్ మస్క్‌‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనను తాను ఎప్పుడూ ఇష్టపడతానన్నారు.

Updated Date - 2022-11-20T12:24:20+05:30 IST