Himachal Pradesh Elections 2022: మరికొద్ది గంటల్లో ఎన్నికలు.. అభ్యర్ధుల్లో గుబులు..
ABN , First Publish Date - 2022-11-11T21:12:28+05:30 IST
సిమ్లా: 68 సీట్లున్న హిమాచల్ అసెంబ్లీకి శనివారం (నవంబరు 12న) ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
సిమ్లా: 68 సీట్లున్న హిమాచల్ అసెంబ్లీ (Himachal Pradesh Assembly Elections)కి శనివారం (నవంబరు 12న) ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (Election Commission of India) అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 7884 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
2017లో 44 స్థానాల్లో గెలుపుతో బీజేపీ (BJP) విజయకేతనం ఎగురవేసి రెండోసారి బరిలోకి వచ్చే ఉద్దేశంతో కమలనాథులు ఉధృతంగా ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు వివిధ రాష్ట్రాల బీజేపీ సీఎంలు జోరుగా ప్రచారం చేశారు. ఏ పార్టీ వరుసగా రెండుసార్లు గెలిచిన చరిత్ర లేకపోవడంతో ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి, 1985 తర్వాత ఏ పార్టీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రాలేదన్న ఆనవాయితీని బ్రేక్ చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ ప్రచారం నిర్వహించింది.
2017లో 21 స్థానాలు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా పాగా వేసే ఉద్దేశంతో ప్రచారం నిర్వహించింది.
ఆనవాయితీ ప్రకారం ఈసారి గెలుపు తమదేనన్న ధీమాతో కాంగ్రెస్ (Congress) తీవ్రంగా యత్నించింది. సాధారణంగా అధికార పార్టీపై ఉండే వ్యతిరేకత హిమాచల్‌లో బీజేపీపైనా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగులేమో పాత పెన్షన్ పథకం కోసం డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా అధికార పార్టీపై ప్రజాగ్రహానికి కారణమవుతోంది.
నిరుద్యోగం, పాత పింఛను విధానం, యాపిల్ రైతుల సమస్యలు, రోడ్ల అనుసంధానం, అగ్నిపథ్ స్కీమ్. హిమాచల్‌లో నిరుద్యోగ రేటు సెప్టెంబరులో 9.2 శాతంగా, అక్టోబరులో 8.6 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు (7.6శాతం) కన్నా ఎక్కువ. హిమాచల్‌లో ఉద్యోగం చేయగలిగిన వయసు, అర్హత ఉండి ఉద్యోగాలు లేనివారి సంఖ్య దాదాపు 15 లక్షలు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలూ హామీలు గుప్పించాయి. అలాగే.. 2003లో ఎత్తేసిన పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలంటూ ప్రభుత్వోద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో.. 2021లో బీజేపీ సర్కారు దీనిపై ఒక కమిటీని నియమించింది. తమ మేనిఫెస్టోలో మాత్రం దీనిపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రధానాంశంగా చేర్చింది.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో మూడు ప్రధాన పార్టీలూ హామీల వర్షాన్ని కురిపించాయి. అధికార బీజేపీ.. ఉమ్మడి పౌర స్మృతి అమలు, మహిళలకు ప్రభుత్వోద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్‌ను తమ ప్రధాన హామీలుగా ప్రకటించింది. కాంగ్రె్‌సపార్టీ ఓపీఎ్‌సను, ఉద్యోగాల భర్తీని ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ఆప్ ఢిల్లీ తరహాలోనే ఎక్కువగా ఉచితాలను తాయిలాలుగా ప్రకటించింది. అయితే... ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గుజరాత్‌పై పెట్టినంత శ్రద్ధ హిమాచల్‌పై పెట్టలేదు. దీంతో హిమాచల్‌లో పోటీ ప్రధానంగా కాంగ్రె్‌స-బీజేపీ మధ్యనే నెలకొంది.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు గుజరాత్‌తోపాటు డిసెంబరు 8న వెలువడనున్నాయి.