Elon Musk : భారీగా ఆవిరైపోయిన ఎలన్ మస్క్ సంపద... మానవ చరిత్రలో ఇది ఓ రికార్డు...

ABN , First Publish Date - 2022-12-31T15:10:52+05:30 IST

అనేక మంది రకరకాల అంశాల్లో ప్రతిభ చూపుతూ ఘనతవహిస్తూ ఉంటారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం సంపదను

Elon Musk : భారీగా ఆవిరైపోయిన ఎలన్ మస్క్ సంపద... మానవ చరిత్రలో ఇది ఓ రికార్డు...
Elon Musk

న్యూఢిల్లీ : అనేక మంది రకరకాల అంశాల్లో ప్రతిభ చూపుతూ ఘనతవహిస్తూ ఉంటారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం సంపదను పోగొట్టుకోవడంలో రికార్డు సృష్టించారు. నికర సంపద విలువలో 200 బిలియన్ డాలర్లను కోల్పోయారు. ఇది మానవ చరిత్రలోనే ఓ రికార్డు. 2021 జనవరిలో వెల్లడైన సమాచారం ప్రకారం, 200 బిలియన్ డాలర్లకుపైగా వ్యక్తిగత సంపదగల మొదటి వ్యక్తి జెఫ్ బెజోస్ కాగా, రెండో వ్యక్తిగా ఎలన్ మస్క్. ఈ వివరాలను బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

ఎలన్ మస్క్ (Elon Musk) సంపద ఆవిరైపోవడానికి కారణం ఏమిటంటే, ఇటీవలి వారాల్లో టెస్లా షేర్లు క్షీణించడం, అంతేకాకుండా డిసెంబరు 27న టెస్లా షేర్లు 11 శాతం పతనమవడం. దీంతో ఆయన సంపద 137 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది.

టెస్లా అమెరికన్ కస్టమర్లకు సంవత్సరం చివరినాటికి తన రెండు హయ్యెస్ట్ వాల్యూమ్ మోడల్స్‌కు 7,500 డాలర్ల డిస్కౌంట్ ప్రకటించింది. తన షాంఘై ప్లాంట్‌లో ఉత్పత్తిని కూడా తగ్గించేసినట్లు తెలుస్తోంది.

2021 నవంబరులో మస్క్ సంపద విలువ 340 బిలియన్ డాలర్లు ఉండేది. ఆయన దాదాపు ఓ సంవత్సరంపాటు ప్రపంచ సంపన్నుల్లో ప్రథమ స్థానంలో ఉండేవారు. ఈ నెలలో ఆయనను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించారు. బెర్నార్డ్ ఫ్రెంచ్ బిజినెస్ మేగ్నెట్, లగ్జరీ గూడ్స్ పవర్‌హౌస్ ఎల్‌వీఎంహెచ్ సహ వ్యవస్థాపకుడు.

ట్విటర్ ప్రభావం

మస్క్ అక్టోబరులో ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. దీనికోసం ఆయన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే తన కంపెనీ టెస్లాలో తన వాటాల్లో అత్యధిక భాగం అమ్మేశారు. దీంతో ఆయనకుగల అతి పెద్ద ఆస్తుల జాబితా నుంచి టెస్లా తొలగిపోయింది. మరోవైపు వడ్డీ రేట్ల పెరుగుదల కూడా ఆయన సంపద క్షీణించడానికి కారణమైంది.

Updated Date - 2022-12-31T15:28:25+05:30 IST