Anil Deshmukh: జైలు నుంచి మాజీ హోం మంత్రి విడుదల

ABN , First Publish Date - 2022-12-28T17:45:52+05:30 IST

మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిలుపై బుధవారంనాడు...

Anil Deshmukh: జైలు నుంచి మాజీ హోం మంత్రి విడుదల

ముంబై: మహారాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌ (Anil Deshmukh) ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిలుపై (Bail) బుధవారంనాడు విడుదలయ్యారు. 72 ఏళ్ల దేశ్‌ముఖ్ ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. మనీ లాడరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంతో నవంబర్ 2021 నుంచి ఆయన జైలు జీవితం గడిపారు. డిసెంబర్ 12వ తేదీన జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బెయిల్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు అడగటంతో డిసెంబర్ 27 వరకూ హైకోర్టు తమ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.

అనంతరం అత్యున్నత న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించింది. కోర్టుకు సెలవులు కావడంతో 2023 జనవరిలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుంది. ఈ క్రమంలో తమకు మరికొంత వ్యవధి కావాలని కోర్టును సీబీఐ మంగళవారంనాడు కోరింది. దీనిపై దేశ్‌ముఖ్ న్యాయవాదులు అంకిత్ నికమ్, ఇంద్రపాల్ సింగ్ తన వాదన వినిపిస్తూ, ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిలును మరోసారి పొడిగించేంది లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. వాదనల అనంతరం కోర్టు బుధవారంనాడు తీర్పు వెలువరిస్తూ, తాము బెయిలు మంజూరు చేస్తూ ఇంతకుముందు ఇచ్చిన తీర్పుపై మరోసారి స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో దేశ్‌ముఖ్ విడుదలకు మార్గం సుగమం అయింది.

దేశ్‌ముఖ్ హోం మంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేశారని, కొందరు పోలీసు ఆఫీసర్ల ద్వారా ముంబైలోని బార్ల యజమానుల నుంచి రూ.4.70 కోట్లు వసూలు చేశాడని సీబీఐ ఆరోపణగా ఉంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని దేశ్‌ముఖ్ చెబుతున్నారు.

సాదర స్వాగతం...

కాగా, ఏడాదికి పైగా జైలులో ఉన్న అనిల్ దేశ్‌ముఖ్‌కు బెయిలుపై విడుదల కావడంతో ఆయన అభిమానులు, ఎన్‌సీపీ కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు.

Updated Date - 2022-12-28T17:45:55+05:30 IST