Gujarat Elections Results: గుజరాత్‌లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడానికి ఒవైసీ కారణమట!
ABN , First Publish Date - 2022-12-08T17:32:46+05:30 IST
గుజరాత్‌లో తాము చిత్తుగా ఓడిపోవడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారణమని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
గాంధీనగర్: గుజరాత్‌లో తాము చిత్తుగా ఓడిపోవడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారణమని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జే ఠాకోర్ విలేకరులతో మాట్లాడుతూ ఒవైసీపై విరుచుకుపడ్డారు. ఒవైసీ వల్లే తమ ఓట్లు చీలాయన్నారు. అందుకే తాము పరాజయం పాలయ్యామని చెప్పారు.
నిజానికి అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ కేవలం 13 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో దించింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో కేవలం 13 స్థానాల్లో మాత్రమే ఎంఐఎం తన అభ్యర్థులను పోటీకి నిలిపింది. బీజేపీ 150కి పైగా స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 17 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే 13 స్థానాలకు మాత్రమే పోటీ చేసిన ఎంఐఎం గుజరాత్ అంతటా పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థులను ఎలా ఓడించిందనేది కాంగ్రెస్ నేతలు చెప్పడం లేదు.
వాస్తవానికి ఎంఐఎం పోటీ చేసిన చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఎంఐఎం టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 12 మంది ముస్లిం అభ్యర్థులే. అహ్మదాబాద్‌లోని జమాల్పూర్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి సాబీర్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ గెలిచారు కూడా.