Rahul Vs Himanta : తొడ కొడతారు, కానీ బరిలో దిగరు... హిమంత బిశ్వ సెటైర్లు...

ABN , First Publish Date - 2022-11-19T13:12:47+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ

Rahul Vs Himanta : తొడ కొడతారు, కానీ బరిలో దిగరు... హిమంత బిశ్వ సెటైర్లు...
Himanta Biswa Sharma, Rahul Gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) శనివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ యుద్ధానికి సిద్ధమవుతూనే ఉంటారని, బరిలో మాత్రం దిగరని అన్నారు. ఆయనకు ఉన్న ఈ అలవాటును తాను చాలా కాలం నుంచి గమనిస్తున్నానని చెప్పారు. గువాహటిలో క్రికెట్ మ్యాచ్ ఉంటే, ఆయన గుజరాత్‌లో ప్యాడ్స్ కట్టుకుని, బ్యాట్ పట్టుకుంటారన్నారు. బ్యాట్ పట్టుకుని సిద్ధమవుతూనే ఉంటారని, బరిలోకి మాత్రం వెళ్ళరని చెప్పారు.

గుజరాత్ శాసన సభ ఎన్నికలు (Gujarat Assembly Elections) డిసెంబరు 1, 5 తేదీల్లో జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గుజరాత్‌లో పర్యటించకపోవడంపై శర్మ ఈ విధంగా స్పందించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party), కాంగ్రెస్ (Congress) రెండు, మూడు స్థానాల్లో ఉంటాయని జోస్యం చెప్పారు. బీజేపీ (BJP) ఎక్కడ ఉండాలో అక్కడే ఉందని, బీజేపీకి పోటీ లేదని చెప్పారు. ఆప్, కాంగ్రెస్ రెండు, మూడు స్థానాల కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు.

స్వాతంత్ర్య వీర సావర్కర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆయనకు చరిత్ర గురించి పెద్దగా ఏమీ తెలియదని చెప్పారు. చరిత్రను ఆయన కోసం వేరొకరు చదివి ఉంటారని, ఆయన స్వయంగా చదివి ఉండరని అన్నారు. సావర్కర్‌ను అవమానించడం ద్వారా ఆయన తీవ్రమైన పాపం చేశారన్నారు. ఈ పాపానికి ఆయన రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటారన్నారు.

భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ మహారాష్ట్రలో మాట్లాడుతూ, సావర్కర్ బీజేపీ, ఆరెస్సెస్ సింబల్ అన్నారు. ఆయన అండమాన్ జైలులో రెండు, మూడేళ్ళు శిక్ష అనుభవిస్తున్న సమయంలో క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ పాలకులకు లేఖ రాశారని చెప్పారు. ఆ లేఖలో ‘‘మీ అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉంటాను సార్’’ అని రాశారన్నారు. ఈ లేఖపై ఆయన ఈ విధంగా సంతకం చేశారంటే, దాని అర్థం ఏమిటని ప్రశ్నించారు. అది భయమేనని, ఆయన బ్రిటిష్ పాలకులకు భయపడ్డారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన తీవ్రంగా మండిపడుతున్నాయి.

Updated Date - 2022-11-19T13:16:08+05:30 IST