Eknath Shinde: సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2022-12-18T19:33:52+05:30 IST
ముంబై: మహారాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ముంబై: మహారాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో అవినీతికి తావులేని పాలన అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. పూర్తి పారదర్శక పాలన అందిస్తామన్నారు.
ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ మొత్తం లోకాయుక్త పరిధిలోకి తీసుకువస్తామని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. లోకాయుక్త కింద ఐదుగురు రిటైర్డ్ జడ్జిలుంటారని వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టం కూడా ఇందులో భాగంగా ఉంటుందన్నారు. అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహజారే నేతృత్వంలోని కమిటీ లోకాయుక్తను ప్రవేశపెట్టే విషయంపై సమర్పించిన నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఫడ్నవీస్ తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకొస్తామన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఏడాది జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు శివసేన (Shiv Sena) నుంచి విడిపోయి, బీజేపీ (BJP)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఉద్ధవ్ థాకరే కమలనాథులకు కటీఫ్ చెప్పారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్ అఘాడీని ఏర్పాటు చేసి సంకీర్ణ సర్కారుకు రెండున్నరేళ్ల పాటు సీఎంగా కొనసాగారు. అయితే ఉద్ధవ్ విధానాలతో విభేదించిన శివసేన ఎమ్మెల్యేలు ఎంపీలు తిరుగుబాటు చేసి బీజేపీతో దోస్తీ చేశారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు.