Himachal Pradesh Polls : హిమాచల్ ప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తథ్యం : మోదీ
ABN , First Publish Date - 2022-11-05T17:44:46+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) గెలుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) గెలుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఆ రాష్ట్రంలోని సోలన్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే నమ్మకం ఉందన్నారు. బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని, సుస్థిర ప్రభుత్వం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
ఈరోజు సోలన్ యావత్తు దేశానికి ఓ సందేశాన్నిచ్చిందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మళ్ళీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే సందేశాన్ని పంపించిందన్నారు. ‘హిమాచల్‌లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదాన్ని గట్టిగా వినిపించారు. సోలన్ తనకు ఎంతో ఇచ్చిందని, ఎంతో నేర్పించిందని, అందువల్ల తాను సోలన్‌కు రెట్టింపు రుణపడి ఉన్నానని తెలిపారు. ‘‘మీ ఆశీర్వాదాలతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటవుతుందనే నమ్మకం నాకు ఉంది’’ అని చెప్పారు.
రాష్ట్రానికి సుస్థిరతను ఇచ్చే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకావలసిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. గత ప్రభుత్వాల గురించి ప్రస్తావిస్తూ, 30 ఏళ్ళపాటు ఢిల్లీలో అస్థిరత్వం రాజ్యమేలిందన్నారు. ప్రభుత్వాలు వస్తూ, పోతూ, మళ్లీ మళ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండేవన్నారు. ఎన్నికల కోసం వేల కోట్ల రూపాయలు వృథా అవుతుండేవన్నారు. 2014లో ప్రజలు ఓ సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేశారన్నారు.
కాంగ్రెస్ పరిపాలించిన కాలంలో అనేకమంది స్వార్థపరులు భారత దేశంలో సుస్థిర ప్రభుత్వాన్ని చూడాలని కోరుకోలేదన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రాలే ఇటువంటి స్వార్థపరులకు లక్ష్యంగా ఉండేవన్నారు. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ వంటి చిన్న రాష్ట్రాలు సుస్థిర ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచాయన్నారు. ప్రభుత్వాలను మార్చే సంప్రదాయం ఉత్తర ప్రదేశ్‌లో ఉండేదన్నారు. కానీ ఆ రాష్ట్ర ప్రజలు ఆ సంప్రదాయాన్ని మార్చారని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్ళీ వచ్చిందని చెప్పారు. సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడటం వల్ల ఉగ్రవాదం, నక్సలిజం అదుపులోకి వచ్చాయన్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం వల్ల అవినీతికి, అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైందని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 12న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరుగుతుంది. రాష్ట్రంలోని 68 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.