Bharat Jodo Yatra: టీ షర్ట్‌లో రాహుల్‌కు చలివేయదా? సీక్రెట్ ఏంటి?
ABN , First Publish Date - 2022-12-23T17:01:58+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంలో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర' మరోసారి వార్తల్లోకి..
సోహ్నా: కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra) మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనికి కారణం ఆయన ధరించిన టీ-షర్ట్ (T-shirt). అయితే ఈసారి మాత్రం టీషర్ట్ ధర ప్రస్తావన గురించి కాదు. గడ్డ కట్టించే చలిలో ఆయన టీ-షర్ట్ ఎలా వేసుకుని పాదయాత్ర చేస్తున్నారు? ఆయనకు చలి వేయదా? ఆయన టీషర్ట్ ధరించడం వెనుక సీక్రెట్ ఏమిటి?. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ నేత జేడీ దలాల్ ఇదే ప్రశ్న తాజాగా లేవనెత్తారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ సైతం అంతే హ్యూమర్‌తో సమాధానమిచ్చింది.
రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' హర్యానాలోని సోహ్నాలో ప్రస్తుతం జరుగుతోంది. రాహుల్ తెలుపురంగు టీ-షర్ట్‌లో యాత్ర సాగిస్తున్నారు. దీనిపై దలాల్ స్పందిస్తూ, తాను ఎక్కడికి వెళ్లినా జనం తనను ఒక ప్రశ్న అడుగుతున్నారని, రాహుల్ గాంధీ హాఫ్ టీ-షర్ట్ వేసుకుని యాత్రలో పాల్గొంటున్నప్పటికీ ఏమాత్రం చలిని లెక్కచేయనట్టు కనిపిస్తారెందుకు? ఆయనకు చలి వేయడా అని అడుగుతున్నారని చెప్పారు. రాహుల్ ఏ తరహా మెడిసిన్ తీసుకుంటారు? అని జనం ప్రశ్నిస్తున్నారని, ఆ ఫార్ములా ఏమిటో ఆయన చెప్పి, హిమాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు దానిని అందుబాటులోకి తీసుకువస్తే దేశానికి మేలు చేసినట్టు అవుతుందని అన్నారు.
సీక్రెట్ చెప్పిన జైరామ్ రమేష్..
బీజేపీ మంత్రి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ స్పందించారు. ''ఆయన (రాహుల్ గాంధీ) చర్మం మందం. అందువల్లే ఆయనకు చలివేయడం లేదు. ఆయన (మంత్రి) అడిగిన ప్రశ్నకు నేను ఏం జవాబు చెప్పాలి?'' అంటూ జైరామ్ రమేష్ నవ్వులు చిందించారు.
107 రోజులుగా...
కన్యాకుమారి నుంచి రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర 107 రోజులుగా సాగుతోంది. రాహుల్ కేవలం తెలుపురంగు టీ-షర్ట్‌తోనే మొదట్నించీ ఈ యాత్రలో పాల్గొంటున్నారు. మంచులో ఉదయం 6 గంటలకు ఆయన జర్నీ మొదలవుతోంది. హర్యానాలో ప్రస్తుతం ఆయనతో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ నేతలు భూపిందర్ హుడా, రణ్‌దీప్ సూర్జేవాలా, కుమారి సెల్జాలు ఒంటిపై జాకెట్లు, మఫ్లర్లు ధరిస్తుండగా, రాహుల్ మాత్రం టీ-షర్ట్‌తోనే నడక సాగిస్తున్నారు. కాగా, రాహుల్ యాత్ర శనివారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టనుంది.