Bharat Jodo Yatra : రాహుల్ గాంధీకి ఆ ప్రోటీన్ లేదు... అందుకే తీవ్రమైన చలిని తట్టుకోగలుగుతున్నారు...
ABN , First Publish Date - 2022-12-27T19:49:31+05:30 IST
భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఢిల్లీలో ప్రవేశించినప్పటి నుంచి అందరి దృష్టి రాహుల్ గాంధీ (Rahul Gandhi)ఫైనే ఉంది.
న్యూఢిల్లీ : భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఢిల్లీలో ప్రవేశించినప్పటి నుంచి అందరి దృష్టి రాహుల్ గాంధీ (Rahul Gandhi)ఫైనే ఉంది. విపరీతమైన చలిలో ఆయన కేవలం టీ-షర్ట్ ధరించి, పాదయాత్ర చేస్తుండటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుండగా, కొందరు మాత్రం ఇవన్నీ జిమ్మిక్కులని ఆరోపిస్తున్నారు. అయితే చలిని తట్టుకోగలగడానికి కారణాన్ని సైన్స్‌లో వెతికితే ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
మనలో కొందరు చలి, వేడి వాతావరణాలను తట్టుకోగలుగుతారు. దీనికి కారణం శరీరంలోని నరాల వ్యవస్థ. దీనిలో ప్రత్యేకమైన నాడీకణ గ్రాహకాలు (nerve cell receptors) ఉండటం వల్ల ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకోవడం సాధ్యమవుతుంది. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా వ్యవహరించే విధంగా మెదడుకు ఈ వ్యవస్థ సంకేతాలు పంపిస్తుంది. ఈ గ్రాహకాల పనితీరును జన్యు పరివర్తనలు (genetic mutations) ప్రభావితం చేస్తాయని 2021లో ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ జన్యు పరివర్తనలు కొందరిలో ప్రత్యేకమైన మార్పులకు దారి తీస్తాయని తెలిపింది. ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల అతి వేడి, అతి చలి వాతావరణాలను తట్టుకోవడం సాధ్యమవుతుందని పేర్కొంది.
150 కోట్ల మందికి చలి అనిపించదు
‘అమెరికన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్’లో ప్రచురితమైన ఓ అధ్యయన నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు కాగా, వీరిలో 150 కోట్ల మందికి తీవ్రమైన శీతల లేదా తీవ్రమైన వేడి వాతావరణాల్లో పని చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. దీనికి కారణం వారి శరీరంలోని వేగంగా సంకోచించే అస్థిపంజర కండరాల పోగు (fast-twitch skeletal muscle fibre)లో a-actinin-3 అనే ప్రొటీన్ లేకపోవడమే.
అస్థిపంజర కండరాల్లో వేగంగా సంకోచించే కండరాల పోగు, నెమ్మదిగా సంకోచించే కండరాల పోగు ఉంటాయి. నెమ్మదిగా సంకోచించే కండరాల పోగు వల్ల తట్టుకోగలిగే శక్తి వస్తుంది. బాహ్య ప్రేరణల్లో మార్పులను క్రీడాకారులు తట్టుకోవడానికి ఉపయోగపడేది వేగంగా సంకోచించే కండరాల పోగు.
కరొలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, ఏ-ఏక్టినిన్-3 (a-actinin-3) లేనివారు చల్లని నీటిలో మునిగినపుడు శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడంలో అది లేనివారి కన్నా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగియుంటారు. అస్థిపంజర కండరాల్లో ఉష్ణం ఉత్పత్తి అవడం ద్వారా శక్తి ఖర్చవడమే దీనికి కారణం.
ఈ ప్రొటీన్ లేకపోవడం వల్ల కండరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. అయితే పవర్, స్ప్రింట్ యాక్టివిటీస్‌కు ప్రతికూలత ఏర్పడుతుంది. ప్రజల శరీరాల్లో ఇటువంటి ప్రత్యేక మార్పులు అకస్మాత్తుగా రాలేదు. లక్షల సంవత్సరాల పరిణామక్రమంలో ఈ మార్పులు వచ్చాయి. కొందరు తీవ్రమైన వాతావరణాలను తట్టుకోగలగడానికి, మరికొందరు తట్టుకోలేకపోవడానికి ఈ మార్పులే కారణం.