Gujarat elections : మోదీకి రవీంద్ర జడేజా ధన్యవాదాలు
ABN , First Publish Date - 2022-11-10T16:54:48+05:30 IST
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి
గాంధీ నగర్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన సతీమణి రివబ జడేజాకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల బరిలో నిలిచే అవకాశాన్ని పొందిన రివబను అభినందించారు.
గుజరాత్‌లో 182 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి డిసెంబరు 1, 5 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది. రవీంద్ర జడేజా సతీమణి రివబకు బీజేపీ టిక్కెట్‌పై ఉత్తర జామ్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. అదేవిధంగా మోర్బిలో తీగల వంతెన కూలిపోయినపుడు సాహసోపేతంగా నదిలో దూకి కొందరిని కాపాడేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతీయకు కూడా టిక్కెట్ లభించింది.
ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా ఇచ్చిన ట్వీట్‌లో, జైహింద్ అని నినదించారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్ పొందినందుకు తన భార్య రివబను అభినందించారు. ఆమె ఎంతో శ్రమతో కృషి చేసినందుకు గర్వంగా ఉందన్నారు. సమాజ అభివృద్ధి కోసం కృషిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
తన సతీమణి రివబ శక్తిసామర్థ్యాలను విశ్వసించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)లకు జడేజా ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ ఉత్తర జామ్ నగర్ సిటింగ్ ఎమ్మెల్యే ధర్మేంద్ర సింహ్ ఎం జడేజాను పక్కనబెట్టి రివబకు టిక్కెట్ ఇచ్చింది. రివబ మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆమె కాంగ్రెస్ సీనియర్ నేత హరి సింగ్ సోలంకికి బంధువు. 2016లో ఆమె రవీంద్ర జడేజాను పెళ్లి చేసుకున్నారు. ఆమె జామ్ నగర్-సౌరాష్ట్ర ప్రాంతంలో చురుగ్గా వ్యవహరించే రాజకీయ నాయకురాలు. ఆమె గత కొద్ది నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ, ప్రజల మద్దతు కోరుతున్నారు.