Salman Khurish: రాహుల్‌ను రాముడితో పోల్చిన మాజీ విదేశాంగ మంత్రి
ABN , First Publish Date - 2022-12-27T19:14:25+05:30 IST
దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీపై ఆ పార్టీ..
మొరాదాబాద్: దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'కు సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ (Salman Khurshid) ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీని 'మానవాతీతుడు' (Suprerhuman)గా అభివర్ణించారు. తపస్సు చేస్తున్న యోగి అని అన్నారు. రాహుల్‌ను రాముడితోనూ, కాంగ్రెస్ కార్యకర్తలను రాముని సోదరుడైన భరతుడితోను పోల్చారు.
భారత్ జోడో యాత్ర సమన్వయకర్తగా ఉన్న సల్మా్న్ ఖుర్షీద్ సోమవారంనాడిక్కడ మీడియోతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి మానవాతీత శక్తులున్నాయని, గడ్డకట్టించే చలిలో మనం జాకెట్లు ధరిస్తామని, ఆయన టీ-షర్ట్‌తోనే బయటకు (భారత్ జోడో యాత్ర కోసం) వస్తున్నారని అన్నారు. ఒక యోగిలా తాను సాగిస్తున్న తపస్సుపైనే ఆయన దృష్టి సారించారని చెప్పారు. రాహుల్‌ను రాముడితోనూ, కాంగ్రెస్ కార్యకర్తలను భరతుడితోనూ పోలుస్తూ...'' రాముడి పాదుకలు ఎంతదూరమైన వెళ్తాయి. ఒకానొక సమయంలో రాముడి పాదుకలను భరతుడు తలపై మోసుకొని వెళ్లాడు. అలాగే, మేము కూడా ఉత్తరప్రదేశ్‌కు పాదుకలతో చేరుకున్నాం. రాముడు కూడా వస్తాడు. ఇది మా నమ్మకం'' అని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. రాహుల్ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర ఇంతవరకూ ఉత్తరప్రదేశ్ గుండా వెళ్లకపోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, జనవరి 3న ఘజియాబాద్‌లోని లోని (Loni) ద్వారా యూపీలోకి యాత్ర అడుగుపెడుతుందని చెప్పారు. ఆ తర్వాత భాగ్‌పట్, షామ్లి మీదుగా హర్యానాలో ప్రవేశిస్తుందని తెలిపారు. కరోనాను దృష్టిలో ఉంచుకుని యాత్ర సందర్భంగా శాస్త్రీయపరమైన మార్గదర్శకాలను పాటించనున్నట్టు చెప్పారు.
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి సంబంధించిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, వాజ్‌పేయిని తాము గౌరవిస్తామని, ఆ కారణంగానే ఆయన సమాధిని రాహుల్ గాంధీ సందర్శించారని చెప్పారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు పట్టించుకోనవసరం లేదన్నారు. దేశాన్ని ప్రేమించే వారిని ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర పనిచేస్తుండగా, విద్వేష వ్యాప్తి ద్వారా దేశాన్ని విభజించేందుకు బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. కాగా, ఖుర్షీద్ వ్యాఖ్యలను బీజేపీ కొట్టివేసింది. ఆయన (ఖుర్షీద్)బారిస్టర్ అయినప్పటికీ కేవలం ముఖస్తుతి కోసం అన్నమాటలేనని బీజేపీ ప్రతినిధి హరిశ్చంద్ర శ్రీవాస్తవ చెప్పారు.