Ukraine : ‘స్త్రీలపై దారుణాలను ప్రోత్సహిస్తున్నది రష్యా సైనికుల భార్యలే’
ABN , First Publish Date - 2022-11-30T17:56:30+05:30 IST
ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాల విషయంలో అత్యంత దారుణమైన అంశాన్ని ఆ దేశాధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ
లండన్ : ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాల విషయంలో అత్యంత దారుణమైన అంశాన్ని ఆ దేశాధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) సతీమణి ఒలెనా జెలెన్‌స్కా (Olena Zelenska) బయటపెట్టారు. తమ దేశ మహిళలపై అత్యాచారాలు చేయాలని రష్యా సైనికులను వారి భార్యలే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తమ దేశంపై దండయాత్రలో ఓ ఆయుధంగా లైంగిక దాడులను వాడుకుంటున్నారని తెలిపారు. యుద్ధ సమయంలో లైంగిక హింసను ఎదుర్కొనడంపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో ఆమె మాట్లాడారు.
తమ దేశం (Ukraine)పై ఫిబ్రవరి నుంచి రష్యా (Russia) యుద్ధం చేస్తోందని, వ్యవస్థీకృతంగా, బహిరంగంగా లైంగిక హింసకు పాల్పడుతోందని చెప్పారు. ఒకరిపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ఉపయోగించే అత్యంత క్రూరమైన, పశుప్రాయమైన విధానం సెక్సువల్ వయొలెన్స్ (Sexual violence) అని చెప్పారు. ఇటువంటి హింసకు బాధితులైనవారు యుద్ధం సమయంలో సాక్ష్యం చెప్పడం, నిరూపించుకోవడం చాలా కష్టమని తెలిపారు. తమకు రక్షణ ఉందనే భావం ఎవరికీ ఉండకపోవడమే దీనికి కారణమన్నారు. రష్యన్ల అమ్ముల పొదిలో ఉన్న మరొక అస్త్రం మహిళలపై అత్యాచారాలు చేయడమని తెలిపారు. ఈ ఆయుధాన్ని వారు వ్యవస్థీకృతంగా, బాహాటంగా వాడుతున్నారన్నారు.
రష్యన్ సైనికులు తమ బంధువులతో జరిపిన ఫోన్ సంభాషణలను తాము విన్నామని, వాటిలో ఈ లైంగిక హింస గురించి అరమరికలు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. వాస్తవానికి ఆ సైనికుల భార్యలే ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ‘‘వెళ్లు, ఉక్రెయిన్ మహిళలను రేప్ చెయ్యి. కానీ ఆ విషయం నాతో చెప్పకు’’ అని వారి భార్యలు వారికి చెప్తున్నారన్నారు.
దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరారు. దీనిని యుద్ధ నేరంగా పరిగణించాలన్నారు. ఈ నేరానికి పాల్పడినవారినందరినీ జవాబుదారీ చేయాలన్నారు.