Uddhav Thackeray: శివసేన అధినేత సంచలన నిర్ణయం!

ABN , First Publish Date - 2022-11-18T17:22:52+05:30 IST

వీర సావర్కర్‌ (Veer Savarkar)పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన తీవ్ర విమర్శలతో నొచ్చుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే

Uddhav Thackeray: శివసేన అధినేత సంచలన నిర్ణయం!
Maha Vikas Aghadi

ముంబై: స్వాతంత్ర వీర సావర్కర్‌ (Veer Savarkar)పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన తీవ్ర విమర్శలతో నొచ్చుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) యూపిఏ నుంచి వైదొలిగాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. కాసేపట్లో ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. విలేకరుల సమావేశంలో మహావికాస్ అఘాడికి గుడ్‌బై చెప్పే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి ఆదిత్య థాకరే ఇటీవలే భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా రాహుల్‌తో కలిసి పాదయాత్ర కూడా చేశారు. అయితే శివసేన స్ఫూర్తిదాతగా భావించే వీరసావర్కర్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేయడాన్ని శివసేన తప్పుబడుతోంది.

భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా మహారాష్ట్రలో పర్యటిస్తోన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వాతంత్ర వీర సావర్కర్‌ను మరోసారి టార్గెట్ చేశారు. అకోలాలో విలేకరుల సమావేశం నిర్వహించి మరీ సావర్కర్‌పై విమర్శలు గుప్పించారు. సావర్కర్ బ్రిటీష్ వారికి రాశారని భావిస్తోన్న లేఖను రాహుల్ చదివి వినిపించారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో గాంధీ, నెహ్రూ, పటేల్ బ్రిటీష్ వారికి క్షమాపణలు చెప్పలేదని, సావర్కర్ మాత్రం బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పారని రాహుల్ ఆరోపించారు. గాంధీ, నెహ్రూ, పటేల్‌లకు ద్రోహం చేయడంతో పాటు సావర్కర్ బ్రిటీష్ వారికి సహకరించారని కూడా రాహుల్ ఆరోపణలు చేశారు. సావర్కర్ పిరికివాడని కూడా రాహుల్ ఆరోపించారు.

వీర సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సావర్కర్‌ను అవమానించడం తగదని హెచ్చరించారు.

2019లో మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections 2019) శివసేన బీజేపీ పొత్తులో సీట్లు పంచుకుని అధికారం చేపట్టేందుకు కావాల్సిన స్థానాలు సంపాదించారు. బీజేపీకి ఎక్కువ స్థానాలు రావడంతో బాల్ థాకరే సమయంలోనే కుదిరిన పాత ఫార్ములా ప్రకారం ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే ముఖ్యమంత్రి పీఠమనే విషయానికి ఉద్ధవ్ తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడి ఏర్పాటు చేసుకుని రెండున్నరేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగారు. అయితే హిందుత్వ సిద్ధాంతాలపై ఉద్ధవ్ రాజీ పడటంతో ఆయన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సీఎం పదవి కోల్పోవడంతో పాటు మెజార్టీ శివసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు శిండే జట్టులో చేరిపోయారు. ఉద్ధవ్ దాదాపు ఒంటరివారైపోయారు. అయితే సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్ధవ్ యూపిఏకు గుడ్‌బై చెబితే తిరిగి ఎన్డీయేలో చేరే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-18T17:37:15+05:30 IST