NRI: ఇది కదా అసలైన విజయం.. అగ్రరాజ్యంలో చరిత్రకెక్కిన 23ఏళ్ల భారతీయ అమెరికన్
ABN , First Publish Date - 2022-11-11T09:06:51+05:30 IST
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Elections) భారతీయ అమెరికన్లు సత్తా చాటారు. ఈ ఎన్నికల్లో సీనియర్స్, జూనియర్స్ అన్న తేడా లేకుండా మనోళ్లు దూసుకెళ్లారు.
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో (US Midterm Elections) భారతీయ అమెరికన్లు సత్తా చాటారు. ఈ ఎన్నికల్లో సీనియర్స్, జూనియర్స్ అన్న తేడా లేకుండా మనోళ్లు దూసుకెళ్లారు. ఇలాగే నబీలా సయ్యద్ (Nabeela Syed) అనే భారతీయ అమెరికన్ యువతి కూడా చరిత్ర సృష్టించారు. 23 ఏళ్లకే ఇల్లినాయిస్ (Illinois) రాష్ట్ర చట్ట సభకు ఎన్నికై రికార్డు కెక్కారు. అధికార డెమొక్రాటిక్ పార్టీకి చెందిన నబీలా.. ఇల్లినాయిస్ 51వ డిస్ట్రిక్ నుంచి పోటీ చేశారు. రిపబ్లిక్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థి క్రిస్ బోస్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 52.30శాతం ఓట్లు రావడం విశేషం. ఈ సందర్భంగా నబీలా తన ఆనందాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
"నా పేరు నబీలా సయ్యద్. నాకు 23 ఏళ్లు. భారతీయ అమెరికన్ ముస్లిం మహిళను. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిపై గెలిచాను. ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలిని" అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో తన విజయం రహస్యం ప్రజలతో మమేకమవ్వడమేనని చెప్పారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదిలాఉంటే.. ఈ మధ్యంతర ఎన్నికల్లోనే తెలుగు మహిళ అరుణా మిల్లర్ (58) చరిత్ర సృష్టించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. అలాగే ఐదుగురు భారత సంతతి వ్యక్తులు రాజా కృష్ణమూర్తి (ఇల్లినాయీ), రో ఖన్నా(కాలిఫోర్నియా), ప్రమీలా జయపాల్(వాషింగ్టన్), థానేదర్ (మిషిగన్), అమీ బెరా (కాలిఫోర్నియా)లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.