Indian origin: కాలిఫోర్నియా అసెంబ్లీలో అడుగుపెట్టనున్న తొలి భారత సంతతి సిక్కు మహిళ

ABN , First Publish Date - 2022-11-12T10:40:20+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీకి (California Assembly) జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి (Indian Origin) చెందిన సిక్కు మహిళ డాక్టర్ జస్మీత్ కౌర్ బెయిన్స్ (Jasmeet Kaur Bains) చరిత్ర సృష్టించారు.

Indian origin: కాలిఫోర్నియా అసెంబ్లీలో అడుగుపెట్టనున్న తొలి భారత సంతతి సిక్కు మహిళ

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీకి (California Assembly) జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి (Indian Origin) చెందిన సిక్కు మహిళ డాక్టర్ జస్మీత్ కౌర్ బెయిన్స్ (Jasmeet Kaur Bains) చరిత్ర సృష్టించారు. బేకర్స్‌ఫీల్డ్‌కు (Bakersfield) చెందిన జస్మీత్ కౌర్ కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి సిక్కు మహిళగా (Sikh Woman) ఆమె రికార్డుకెక్కారు. కెర్న్ కౌంటీలోని (Kern County) 35వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ నుంచి బరిలోకి దిగిన జస్మీత్ కౌర్ తన ప్రత్యర్థి లెటిసియా పెరెజ్‌పై (Leticia Perez) విజయం సాధించారు. ఓ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం జస్మీత్ కౌర్‌కు 10,827 ఓట్లు (58.9శాతం) వస్తే.. పెరెజ్‌కు 7,555 ఓట్లు (41.1 శాతం) వచ్చాయి.

ప్రస్తుతం ఆమె బేకర్స్‌ఫీల్డ్ రికవరీ సర్వీసెస్‌లో మెడికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యసనానికి బానిసలైన వారికి ఈ సంస్థ చికిత్స, సేవను అందిస్తుంది. ఇక తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరోగ్య సంరక్షణ, నీటి సదుపాయాలు, గాలి నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అటు జస్మీత్ కౌర్‌ కరోనా విపత్కర సమయంలో చేసిన సేవలు కూడా ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి కొంతమేర సహాయం చేసింది. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు తాను పెరిగిన నార్త్ కెర్న్ కౌంటీలోని డెలానోలోని టోనీస్ ఫైర్‌హౌస్ గ్రిల్, పిజ్జా రెస్టారెంట్‌లలో దాదాపు వంద మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, మద్ధతుదారులతో కలిసి జస్మీత్ కౌర్ ఎలక్షన్ ఫలితాలను వీక్షించారు.

Jasmith.jpg

జస్మీత్ కౌర్ పేరెంట్స్ కొన్నేళ్ల క్రితం ఇండియా నుంచి యూఎస్ వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆటోమెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఆమె తండ్రికి కార్ల డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కళాశాల విద్య పూర్తైన తర్వాత డాక్టర్ కావడానికి ముందు ఆమె తన తండ్రితో కలిసి వ్యాపారం చూసుకున్నారు. కోవిడ్-19 ఉద్ధృతంగా ఉన్నప్పుడు రోగులకు సేవ చేసేందుకు ఫీల్డ్ హాస్పిటల్ సైట్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా జస్మీత్ కౌర్ అక్కడి స్థానికుల మన్ననలు పొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2019 ఏడాదికి గాను కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ (California Academy of Family Physicians) నుంచి 'హీరో ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్' అవార్డ్(Hero of Family Medicine) లభించింది. అలాగే 2021 సంవత్సరానికి గాను గ్రేటర్ బేకర్స్‌ఫీల్డ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Greater Bakersfield Chamber of Commerce) నుంచి 'బ్యూటిఫుల్ బేకర్స్‌ఫీల్డ్ అవార్డు' పొందారు. ఇప్పుడు కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జస్మీత్ కౌర్ ఏకంగా చరిత్రకెక్కారు.

Updated Date - 2022-11-12T10:40:22+05:30 IST