Christmas Celebrations: గల్ఫ్‌ దేశాల్లో అప్పుడే మొదలైన క్రిస్మస్‌ సందడి

ABN , First Publish Date - 2022-12-18T07:20:42+05:30 IST

గల్ఫ్‌ దేశాల్లో అప్పుడే క్రిస్మస్‌ సందడి మొదలైంది. ముందస్తు వేడుకల్లో భాగంగా తెలుగు క్రైస్తవ కుటుంబాలు కొన్ని రోజులుగా తమ ఇళ్లలో క్యాండిల్‌ లైటింగ్‌ పేరిట వేడుకలు నిర్వహిస్తూ అతిథులకు ఆహ్వానం పలుకుతున్నారు.

Christmas Celebrations: గల్ఫ్‌ దేశాల్లో అప్పుడే మొదలైన క్రిస్మస్‌ సందడి

దుబాయిలో తొలిసారిగా తెలుగు చర్చిల ఐక్య సంబరాలు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాల్లో అప్పుడే క్రిస్మస్‌ సందడి మొదలైంది. ముందస్తు వేడుకల్లో భాగంగా తెలుగు క్రైస్తవ కుటుంబాలు కొన్ని రోజులుగా తమ ఇళ్లలో క్యాండిల్‌ లైటింగ్‌ పేరిట వేడుకలు నిర్వహిస్తూ అతిథులకు ఆహ్వానం పలుకుతున్నారు. ప్రవాసీయుల్లో కొంతమంది స్వదేశానికి వెళ్తుండగా, అత్యధికులు మాత్రం ఇక్కడే వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం దుబాయిలోని యునైటెడ్‌ తెలుగు పాస్టర్స్‌ అసోసియేషన్‌(యూపీఏ) ఆధ్యర్యంలో జరిగిన ఐక్య క్రిస్మస్‌ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాలకొల్లు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎస్‌.కిశోర్‌ ప్రసంగాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ప్రప్రథమంగా దుబాయి నగరంలో ఉన్న 35 తెలుగు చర్చిల ప్రతినిధులు కలిసి ఈ ముందస్తు వేడుకలను నిర్వహించగా.. అందులో దుబాయి తెలుగు అసోసియేషన్‌ కూడా పాల్గొంది. ఇక కువైత్‌ నగరంలోని 70 తెలుగు చర్చిలన్నింటిలో గత పక్షం రోజులుగా పండుగ సందడి నెలకొంది. మస్కట్‌, దోహా, రియాధ్‌, జెద్ధా నగరాల్లో కూడా క్రిస్మస్‌ సందడి నెలకొని ఉంది. రాజధాని నగరం రియాధ్‌లో భారతీయ క్రైస్తవ సంఘాలన్నీ కలిసికట్టుగా తొలిసారిగా క్రిస్మస్‌ పండుగ నిర్వహిస్తుండగా దానికి ప్రవాసీ తెలుగు వారైన విశాఖకు చెందిన దుగ్గపు ఎర్రన్న, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన విల్సన్‌ నాయకత్వం వహిస్తున్నారు. జెద్దా నగరంలోని జీటీసీ తెలుగు చర్చిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. చర్చి పాస్టర్‌, కర్నూలుకు చెందిన హానుక్‌ అభినవ్‌ ఈ సారి కూడా వేడుకలకు ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు.

Updated Date - 2022-12-18T07:22:19+05:30 IST