Abu Dhabi: తండ్రి, కూతురి ఆస్తి తగాదా.. కోర్టు సంచలన తీర్పు!
ABN , First Publish Date - 2022-11-09T12:48:06+05:30 IST
తండ్రి, కూతురి ఆస్తి తగాదా విషయంలో తాజాగా అబుదాబి న్యాయస్థానం (Abu Dhabi Court) సంచలన తీర్పు వెల్లడించింది.
అబుదాబి: తండ్రి, కూతురి ఆస్తి తగాదా విషయంలో తాజాగా అబుదాబి న్యాయస్థానం (Abu Dhabi Court) సంచలన తీర్పు వెల్లడించింది. కూతురి సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తిని ఆమెకు తెలియకుండా విక్రయించినందుకు ఓ తండ్రిని తన కుమార్తెకు 3.3 మిలియన్ దిర్హమ్స్ (రూ.73.13కోట్లు) చెల్లించాలని అబుదాబి ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. పదహారేళ్ల క్రితం తన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తిని తనకు తెలియకుండా విక్రయించిన తండ్రిపై కూతురు కోర్టులో దావా వేసింది. తనకు 3.7 మిలియన్ దిర్హమ్స్ చెల్లించాలని డిమాండ్ చేసింది. తనకు తెలియకుండా అమ్మిన ఆస్తి ద్వారా తండ్రికి 3.7 మిలియన్ దిర్హమ్స్ వచ్చాయని, ఆ నగదు ప్రస్తుతం అతని వద్ద ఉందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. దీంతో ఇరువురి వాదనలు విన్న అబుదాబి కోర్టు తండ్రిని కూతురికి 3.3 మిలియన్ దిర్హమ్స్ (రూ.73.13కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. అంతేగాక నష్టపరిహారం కింద మరో 50వేల దిర్హమ్స్‌తో పాటు కుమార్తె న్యాయపరమైన ఖర్చులను కూడా తండ్రే భరించాలని తీర్పునిచ్చింది.