Death penalty: భారత దంపతులను చంపిన కార్మికుడికి మరణ శిక్ష.. సమర్థించిన దుబాయ్ కోర్టు
ABN , First Publish Date - 2022-11-12T11:42:17+05:30 IST
2020లో అరేబియన్ రాంచెస్‌లో (Arabian Ranches) భారత దంపతులను (Indian Couple) వారి నివాసంలోనే అతి కిరాతకంగా హత మార్చిన భవన నిర్మాణ కార్మికుడికి విధించిన మరణ శిక్షను (Death penalty) తాజా దుబాయ్ అప్పీల్ కోర్టు (Dubai Appeal Court) సమర్థించింది.
దుబాయ్: 2020లో అరేబియన్ రాంచెస్‌లో (Arabian Ranches) భారత దంపతులను (Indian Couple) వారి నివాసంలోనే అతి కిరాతకంగా హత మార్చిన భవన నిర్మాణ కార్మికుడికి విధించిన మరణ శిక్షను (Death penalty) తాజా దుబాయ్ అప్పీల్ కోర్టు (Dubai Appeal Court) సమర్థించింది. మిరాడార్ డిస్ట్రిక్ట్‌లోని రాంచెస్‌లో ఉన్న తమ నివాసానికి దొంగతనానికి వచ్చిన కార్మికుడిని భారతీయ దంపతులు అడ్డుకున్నారు. దాంతో అతడు వారిని చంపేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వారి 18 ఏళ్ల కూతురు నిద్రలోంచి మెలుకువ రాడంతో అతడిని చూసింది. దాంతో ఆమెను కూడా హత్య చేసేందుకు యత్నించాడు. కానీ, ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చేతికి అందిన 2వేల దిర్హమ్స్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి కొద్దిసేపటి తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు సాక్ష్యాలను సేకరించారు. వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు నిందితుడి కొంతకాలం క్రితం దంపతుల ఇంట్లో పనిచేసి మానేసిన కార్మికుడిగా గుర్తించారు. అనంతరం అతడి కోసం గాలించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా అతడు తన నేరాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత కార్మికుడిన దుబాయ్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. దాంతో న్యాయస్థానం అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా ఈ తీర్పును దుబాయ్ అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది. ఇంతటి దారుణానికి పాల్పడిన కార్మికుడికి మరణ శిక్షే సరియైందని పేర్కొంది.