Sriram Krishnan: మస్క్‌ను మెప్పించి.. ట్విటర్‌లో కీలకంగా మారిన శ్రీరామ్ కృష్ణన్ ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2022-11-02T10:14:29+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్(Elon Musk) మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌(Twitter) కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ట్విటర్‌ తన చేతికి వచ్చిన వెంటనే సీఈఓగా ఉన్న భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్‌ (Parag Agarwal)ను తొలగించారు.

Sriram Krishnan: మస్క్‌ను మెప్పించి.. ట్విటర్‌లో కీలకంగా మారిన శ్రీరామ్ కృష్ణన్ ఎవరో తెలుసా?

ఎన్నారై డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్(Elon Musk) మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌(Twitter) కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ట్విటర్‌ తన చేతికి వచ్చిన వెంటనే సీఈఓగా ఉన్న భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్‌ (Parag Agarwal)ను తొలగించారు. అనంతరం అదే ఎలాన్ మస్క్ ఇప్పుడు మరో భారతీయుడి సహాయంతో ట్విటర్‌లో సంస్కరణలు చేపడుతుండడం గమనార్హం. అతడే శ్రీరామ్ కృష్ణన్ (Sriram Krishnan). శ్రీరామ్ ఒక భారతీయ అమెరికన్ పెట్టుబడిదారుడు, సాంకేతిక నిపుణుడు, ఇంజనీర్. చెన్నైలో జన్మించిన ఈ భారతీయ అమెరికన్ ఇంజనీర్ ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్రధాన టీంలో సభ్యుడు. శ్రీరామ్‌ను ట్విటర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ నియమిస్తున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు కూడా. ఈ సందర్భంగా మస్క్‌కు సహకరిస్తున్న విషయాన్ని శ్రీరామ్ కృష్ణన్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

శ్రీరామ్ ఏమన్నారంటే..

ఈ ట్వీట్‌లో ప్రధానంగా తాను ట్విటర్ సంస్థ కోసం ఎలాన్ మస్క్‌కు సహకరిస్తున్నట్లు రాసుకొచ్చారు. 'మరికొంతమంది గొప్ప వ్యక్తులతో కలిసి నేను తాత్కాలికంగా మస్క్ కోసం పనిచేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన సంస్థ అని నేను విశ్వసిస్తున్నాను. ప్రపంచంపై ట్విటర్ గొప్ప ప్రభావం చూపుతుంది. మస్క్ సారథ్యంలో అది తప్పకుండా జరుగుతుందని నేను భావిస్తున్నాను' అని శ్రీరామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, తాను ట్విటర్ కోసం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని.. a16z సంస్థ కోసం తాను ప్రధానంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. శ్రీరామ్ పనిచేసే a16z ఒక ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ. స్టార్టప్‌లు, ఇతర కంపెనీలు, క్రిప్టో సంస్థలలో a16z పెట్టుబడులు పెడుతుంది. అయితే, సీఈఓగా ఉన్న భారతీయుడిని తొలగించి మళ్లీ భారతీయుడిపైనే మస్క్‌ ఆధారపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే.. శ్రీరామ్ గతంలో ట్విటర్, మెటా, స్నాప్‌లో ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ టీమ్స్‌కి నాయకత్వం వహించారు. ట్విటర్‌లో అతను 2017 నుంచి 2019 వరకు మూడేళ్లపాటు కోర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ టీమ్‌కి లీడర్‌గా ఉన్నారు.

ఇంతకీ శ్రీరామ్ కృష్ణన్ ఎవరంటే..

శ్రీరామ్ కృష్ణన్ 2001-2005లో అన్నా యూనివర్సిటీలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. ఇక్కడి నుంచి అతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) పూర్తి చేశారు. శ్రీరామ్‌ది చెన్నైలో మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశారు. అమ్మ గృహిణి. శ్రీరామ్ భార్య పేరు ఆర్తి. 2002లో యాహూ మెసేంజర్ ద్వారా వీరికి పరిచయమైంది. అనంతరం వివాహం చేసుకున్నారు. ఇక చెన్నైలో పుట్టి పెరిగిన శ్రీరామ్ 2005లో తన 21వ యేటా అమెరికాకు వెళ్లడం జరిగింది. యూఎస్‌లోని సీటెల్‌కు వెళ్లిన శ్రీరామ్ మైక్రోసాఫ్ట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ అతను విండోస్ అజూర్‌కు సంబంధించిన అనేక ప్రాజెక్టులపై పనిచేశారు.

ఆ తర్వాత ట్విటర్‌లో పని చేసినప్పుడు ట్విటర్ హోం టైమ్‌లైన్‌, ప్లాట్‌ఫామ్ న్యూ యూజర్ ఇంటర్‌ఫేస్, సెర్చ్‌, డిస్కవరీ, ఆడియెన్స్‌ గ్రోత్‌ వంటి ప్రొడక్ట్‌లకు సంబంధించిన టీమ్స్‌కి నాయకత్వం వహించారు. ఇక ఫేస్‌బుక్‌లో పని చేసిన సమయంలో మొబైల్ యాడ్ ప్రొడక్ట్‌లను సైతం అభివృద్ధి చేశారు. ఇప్పుడా మొబైల్ యాడ్ ప్రొడక్ట్స్‌ డిస్‌ప్లే అడ్వర్‌టైజింగ్ అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటిగా అవతరించింది. ప్రస్తుతం కృష్ణన్‌ సిలికాన్‌ వ్యాలీలోని వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీ అయిన ఆండ్రిసెన్ హోరోవిట్జ్‌ (a16z)లో పార్ట్‌నర్‌గా ఉన్నారు. బిట్‌స్కీ, హోపిన్‌, పాలీవర్క్‌ కంపెనీ బోర్డుల్లోనూ శ్రీరామ్ కృష్ణన్‌ భాగస్వామిగా కొనసాగుతున్నారు.

Updated Date - 2022-11-02T11:07:59+05:30 IST