Indian Family: ఇంగ్లండ్‌లో ఘోరం.. భారతీయ నర్సు ఆమె ఇద్దరు పిల్లలు దారుణ హత్య.. పోలీసుల కస్టడీలో భర్త

ABN , First Publish Date - 2022-12-17T10:01:37+05:30 IST

ఇంగ్లండ్‌లో (England) దారుణం జరిగింది. భారతీయ నర్సుతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు వారి నివాసంలోనే అనుమానస్పద స్థితిలో మృతి చెందారు.

Indian Family: ఇంగ్లండ్‌లో ఘోరం.. భారతీయ నర్సు ఆమె ఇద్దరు పిల్లలు దారుణ హత్య.. పోలీసుల కస్టడీలో భర్త

లండన్: ఇంగ్లండ్‌లో (England) దారుణం జరిగింది. భారతీయ నర్సుతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు వారి నివాసంలోనే అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్‌షైర్‌లో (Northamptonshire) గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతులను అంజూ (40), జాన్వీ (04), జీవా (06)గా గుర్తించారు. మృతురాలి భర్త సాజు (52) ఈ ఘటన తర్వాత అక్కడ లేకపోవడంతో పోలీసులు అనుమానంతో అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం కన్నూర్‌లోని పడియూర్‌కు చెందిన అంజూ (40), సాజు (52) దంపతులకు ఇద్దరు పిల్లలు జాన్వీ (04), జీవా (06) ఉన్నారు. ఏడాది క్రితం భారత్ నుంచి ఇంగ్లండ్ వెళ్లి నార్తాంప్టన్‌షైర్‌లో నివాసం ఉంటున్నారు. సాజు ఓ హోటల్‌లో పనిచేస్తుంటే.. అంజు మాత్రం స్థానికంగా ఉండే కెట్టరింగ్ జనరల్ హాస్పిటల్‌లో (Kettering General Hospital) నర్సుగా పని చేస్తుంది. ఈ క్రమంలో గత నాలుగైదు రోజులుగా ఆమె ఫోన్‌కు కాల్ చేసిన తోటి సిబ్బందికి, బంధువులు, స్నేహితులకు ఎలాంటి స్పందన రాలేదు. దాంతో అనుమానం వచ్చిన స్నేహితులు గురువారం రాత్రి ఆమె నివాసం ఉంటున్న నార్తాంప్టన్‌షైర్‌లోని ఇంటికి వెళ్లి చూశారు. ఆ సమయంలో ఇంటి తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉన్నాయి. బయటి నుంచి ఎంత పిలిచిన డోర్స్ తీయలేదు.

దాంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే అంజు, జాన్వీ, జీవా రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్నారు. అంజు అప్పటికే మృతిచెందగా, పిల్లలు కొన ఊపిరితో ఉన్నారు. దాంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆస్పత్రిలో కొద్దిసేపటికే పిల్లలు కూడా చనిపోయారు. అయితే, ఈ ఘటన తర్వాత భర్త సాజు అక్కడ లేకపోవడం పోలీసులకు అతడిపై అనుమానాన్ని కలిగించింది. దాంతో వెంటనే సాజును కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఈ మిస్టరీ మరణాల వెనుక ఉన్న కారణాలను కనుగొనేందుకు తాము 24/7 పని చేన్నామని నార్తాంప్టన్‌షైర్ పోలీసు (Northamptonshire Police) సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సైమన్ బర్న్స్ (Simon Barnes) అన్నారు. కాగా, సాజు కుటుంబం ఏడాది క్రితమే ఇంగ్లండ్ వెళ్లారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది.

Updated Date - 2022-12-18T07:22:00+05:30 IST