Saudi: 10 రోజుల్లో 12 మంది తలలు నరికిన సౌదీ.. ఇంతకీ వారు చేసిన నేరమేంటంటే..
ABN , First Publish Date - 2022-11-22T12:12:33+05:30 IST
అరబ్ దేశాల్లో నేరాలకు పాల్పడేవారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. దోషులకు అక్కడి ప్రభుత్వాలు బహిరంగంగానే శిక్షలు అమలు చేస్తుంటాయి.
రియాద్: అరబ్ దేశాల్లో నేరాలకు పాల్పడేవారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. దోషులకు అక్కడి ప్రభుత్వాలు బహిరంగంగానే శిక్షలు అమలు చేస్తుంటాయి. ఇలా చేయడం ద్వారా నేరం చేయాలంటే భయం ఉంటుందని అక్కడి వారి మాట. వీటిలో బహిరంగంగా ఉరి తీయడం, తల నరికివేయడం లాంటి శిక్షలు ఉంటాయి. ఇదే కోవలో తాజాగా సౌదీ అరేబియా (Saudi Arabia) వివిధ నేరాలకు పాల్పడి మరణశిక్ష పడిన 12 మందికి శిక్షను అమలు చేసింది. అది కూడా పది రోజుల వ్యవధిలో ఆ 12 మంది తల నరికి మరి శిక్షను అమలు చేసింది. వీరిలో ఎక్కువ మంది మాదకద్రవ్యాల కేసులో దోషులు.
ఇక శిక్ష విధించబడిన వారిలో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సీరియన్లు, ఇద్దరు జోర్డాన్ జాతీయులు, ముగ్గురు సౌదీలు ఉన్నారు. ఈ 12 మందితో కలిపి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 132 మందికి సౌదీ మరణశిక్షను అమలు చేసింది. ఇది 2020, 2021లలో అమలు చేసిన మరణశిక్షల కంటే కూడా ఎక్కువ అని సౌదీ అధికారులు వెల్లడించారు. ఇక గత రెండేళ్లుగా దోషులకు కేవలం ఉరిశిక్షలు మాత్రమే అమలు చేస్తున్న సౌదీ.. ఇప్పుడు మళ్లీ కత్తితో తల నరికే శిక్షను అమలు చేసింది.
ఇదిలాఉంటే.. 2018లో మహమ్మద్ బిన్ సల్మాన్ తన పరిపాలనలో మరణశిక్షను తగ్గించడానికి ప్రయత్నిస్తామని ప్రకటించారు. అది కూడా కేవలం హత్యకు పాల్పడిన వారికి మాత్రమే మరణశిక్ష విధించబడుతుందని చెప్పారు. అప్పటి నుంచి సౌదీలో మరణశిక్షలు తగ్గాయి. కానీ, ఈ ఏడాది మరోసారి ఈ శిక్షలు పెరగడం గమనార్హం. అది కూడా గడిచిన రెండేళ్లలో అమలు చేసిన మరణశిక్షల కంటే కూడా ఎక్కువగా ఉండటం. కాగా, 2020లో జమాల్ ఖషోగ్గి హత్య తర్వాత మరణశిక్షను పూర్తిగా తొలగించేలా చట్టాన్ని మార్చాలని సౌదీ అరేబియా ప్రతిపాదించింది. అయితే, దీని అమలులో మాత్రం జాప్యం జరుగుతోంది.