Telugu Community in Singapore: 'ఏ మార్కెట్‌కు వెళ్లినా.. ఒకరిద్దరు తెలుగువాళ్లు తప్పనిసరిగా కనిపిస్తారు'
ABN , First Publish Date - 2022-12-15T08:39:28+05:30 IST
మనకు దగ్గరగా ఉన్న ద్వీప దేశాల్లో సింగపూర్ ఒకటి. విమానమార్గం ద్వారా మూడు గంటల దూరంలో ఉన్న ఈ ద్వీపంలో తెలుగువారి సంఖ్య కూడా ఎక్కువే.
మనకు దగ్గరగా ఉన్న ద్వీప దేశాల్లో సింగపూర్ ఒకటి. విమానమార్గం ద్వారా మూడు గంటల దూరంలో ఉన్న ఈ ద్వీపంలో తెలుగువారి సంఖ్య కూడా ఎక్కువే. అక్కడి తెలుగువారు తమ సంస్కృతి సంప్రదాయాలను ఎలా కాపాడుకుంటున్నారనే విషయాన్ని అక్కడి సంస్థల్లో ఒకటైన శ్రీ సాంస్కృతి కళాసారథి నిర్వహక సభ్యుల్లో ఒకరైన రాధిక మంగిపూడి ‘నవ్య’కు వివరించారు.
నేను పుట్టింది, పెరిగింది విజయనగరంలో. మా నాన్నగారి పేరు కోటికలపూడి కూర్మనాథం. వృతిరీత్యా ఆంగ్ల ఉపాధ్యాయుడు. కానీ ప్రవృతిరీత్యా సాహితీకారుడు. అందువల్ల నాకూ సాహితీ వాసనలు అంటాయి. నేను 2014లో సింగపూర్ వెళ్లాను. అక్కడ తెలిసినవారు ఎక్కువగా లేరు. అందువల్ల అక్కడ ఉన్న కొన్ని వాట్సప్ గ్రూప్‌లలో చేరాను. 2016లో ‘గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం’ అనే ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించాం. మొదటి ఆరునెలల్లో పదివేల మంది చేరారు. ప్రస్తుతం దీనికి 40 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. 2015లో సింగపూర్‌లో నిర్వహించిన ప్రపంచ సాహితీ సదస్సులో తొలిసారి నేను ప్రసంగించాను. ఆ తర్వాత నా ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. కొవిడ్ సమయంలో అనేక సాహితీ కార్యక్రమాలలో పాల్గొన్నాను. మా సంస్థ ద్వారా సింగపూర్‌కు చెందిన అనేక మంది సాహితీకారులు ప్రపంచానికి పరిచయమయ్యారు. ఇది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది.’’
‘‘సింగపూర్ ఒక చిట్టి దేశం. సింగపూర్‌లో ఒక చివరి నుంచి మరొక చివరకు 40 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అందరూ కష్టపడి పనిచేసే దేశం. ఇక్కడికి అనేక దశాబ్దాల క్రితమే తెలుగువారు వచ్చి స్థిరపడ్డారు. దీనితో సింగపూర్‌లో మనకు అనేక తరాల తెలుగు ప్రతినిధులు మనకు కనిపిస్తారు. ఏ మార్కెట్‌కు వెళ్లినా- ఒకరిద్దరు తెలుగువాళ్లు తప్పనిసరిగా కనిపిస్తారు. సింగపూర్‌లో ఉన్న తెలుగువారందరినీ ఒక తాటి మీదకు తెచ్చి- ఒక వారధిగా నిలవాలనే ఉద్దేశంతో సుమారు 45 ఏళ్ల క్రితం ‘సింగపూర్ తెలుగు సమాజం’ అనే ఒక సంస్థ ఏర్పడింది. తెలుగు పండుగలకు వివిధ కార్యక్రమాలు నిర్వహించటం, సింగపూర్‌లో ఉన్న తెలుగువారికి అనుసంధానంగా నిలవటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. సింగపూర్ చిన్నదే అయినా- ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లటానికి ఎక్కువ సమయం పడుతుంది. అసలే ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ ఒక చోట కలవటం కష్టమే! దీంతో సింగపూర్ తెలుగువారు తమ ఆకాంక్షలు తీర్చేందుకు తెలుగు సమాజం నుంచి బయటకు వచ్చి... వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మేము నిర్వహిస్తున్న ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి కూడా అలా పుట్టిందే. 2015లో దీన్ని స్థాపించాం. సింగపూర్‌లో తెలుగు భాషను పరిపుష్టం చేయటం, సంస్థ పేరుకు తగినట్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం మా ప్రధాన లక్ష్యాలు.
అందరూ కలిసికట్టుగా..
సింగపూర్ తెలుగు సమాజం సంస్థ నుంచి అనేక సంస్థలు ఉద్భవించి ఉండచ్చు. కానీ అందరం కలిసే పనిచేస్తూ ఉంటాం. ఉదాహరణకు మేము ఉగాది కార్యక్రమాలు నిర్వహిస్తే... దానికి అందరూ మద్దతు ఇచ్చారు. అన్ని సంస్థలు వారు ముందుకు వచ్చి సహకరించారు. ఇదే విధంగా ఇతరులు నిర్వహించే కార్యక్రమాలకు మేము కూడా మద్దతు ఇస్తూ ఉంటాం. ప్రస్తుతం మా సంస్థకు మెంబర్‌షిప్ లేదు. మేము నిర్వహించే కార్యక్రమాలల్లో ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. గతంలో సింగపూర్‌లో తెలుగు పండుగల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇవన్నీ అందరూ ఒక చోటకు రావటానికి ఉపయోగపడేవి. మేము సాహిత్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. 2015లో సింగపూర్‌లో ప్రపంచ తెలుగు సాహితీ సమావేశాలు జరిగాయి. వంగూరి ఫౌండేషన్, మలేసియా తెలుగు సమాఖ్య, సింగపూర్ తెలుగు సమాజం- సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు సింగపూర్‌లో నివసించే అనేక మందిలో సాహితీ జిజ్ఞాసను రేకెత్తించాయి. అనేక మంది కథలు, కవితలు రాయటం మొదలుపెట్టారు. ఒకప్పుడు ప్రపంచ వేదికపై సింగపూర్ తెలుగు సాహితీ ప్రతిభ ఎక్కువగా కనిపించేది కాదు. ప్రస్తుతం ఎక్కడ సాహితీ సమావేశం జరిగినా సింగపూర్‌కు చెందిన అనేక మంది సాహితీకారులు పాల్గొంటున్నారు. తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. మేము కూడా సింగపూర్‌కి చెందిన ‘రేడియో చట్నీ’ ఎఫ్‌ఎం రేడియోలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనేక మంది ఇంటర్వ్యూలు, సాహితీగోష్టులు ఇందులో ప్రసారమవుతూ ఉంటాయి.
సమస్యలూ ఉన్నాయి..
సింగపూర్‌లో నివసించే తెలుగువారికి వేరే దేశానికి వచ్చినట్లు అనిపించదు. అదే సమయంలో విదేశాలలో నివసించిన అనుభవం కలుగుతుంది. దూరం తక్కువ కావటం వల్ల... విమానంలో మూడు గంటల్లో హైదరాబాద్ వెళ్లిపోవచ్చు. ఇక్కడ ఇళ్ల అద్దెలు ఎక్కువ. పిల్లల చదువుకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. మనవాళ్లలో ఎక్కువ మంది కార్పొరేట్ సంస్థల్లోనే పనిచేస్తూ ఉంటారు. అందువల్ల మన వారి జీవన ప్రమాణాలు ఎక్కువగానే ఉంటాయి. ఇతర దేశాలకు చెందినవారి పట్ల వివక్ష అసలు ఉండదు. సింగపూర్‌లో డబ్బు ఖర్చు పెట్టగలిగితే చాలా సుఖంగా బతకవచ్చు. సింగపూర్‌లోని స్కూళ్లలో తెలుగు భాష నేర్పరు. దీని వల్ల తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తెలుగు మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనేది మా ప్రయత్నం. అందరి సహకారంతో దీన్ని సాధించగలమనే నమ్మకం మాకుంది.