Telugu Boy: అగ్రరాజ్యంలో తెలుగు కుర్రాడి అద్భుత ప్రతిభ.. ప్రతిష్టాత్మకమైన అవార్డు సొంతం!

ABN , First Publish Date - 2022-12-18T11:01:37+05:30 IST

మనం వాడిపారేసే బ్యాటరీలను రీసైకిల్‌ చేయకపోతే పర్యావరణానికి అపారమైన హాని కలగజేస్తాయి. అలాంటి బ్యాటరీలను ఒక చోటకు చేర్చి వాటిని రీసైకిల్‌ చేస్తే..

Telugu Boy: అగ్రరాజ్యంలో తెలుగు కుర్రాడి అద్భుత ప్రతిభ.. ప్రతిష్టాత్మకమైన అవార్డు సొంతం!

మనం వాడిపారేసే బ్యాటరీలను రీసైకిల్‌ చేయకపోతే పర్యావరణానికి అపారమైన హాని కలగజేస్తాయి. అలాంటి బ్యాటరీలను ఒక చోటకు చేర్చి వాటిని రీసైకిల్‌ చేస్తే.. పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేసినట్లే! ఆ ఆలోచనే మూడేళ్ళ క్రితం న్యూజెర్సీకి చెందిన తెలుగు విద్యార్థి శ్రీనిహాల్‌ తమ్మనకు వచ్చింది. అప్సటికి 10 ఏళ్ల ఆ కుర్రాడు ‘రీసైకిల్‌ మై బ్యాటరీ’ అనే ఒక సంస్థను స్థాపించాడు. స్కూళ్లకు వెళ్లి... బ్యాటరీల రీసైక్లింగ్‌ అవసరాన్ని ప్రచారం చేశాడు. ఇలా మూడేళ్లు పూర్తయిన తర్వాత ఆ సంస్థ బాగా ఎదిగింది. 300 మంది స్టూడెంట్‌ వలంటీర్లు... 2.25 లక్షల బ్యాటరీలను సేకరించి రీసైక్లింగ్‌కు పంపగలిగారు. పర్యావరణ హితానికి ఈ సంస్థ చేస్తున్న కృషిని గుర్తించి అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ - నిహాల్‌కు ఈ వారం ప్రతిష్టాత్మకమైన ‘సీఎన్‌ఎన్‌ హీరోస్‌’ అవార్డును బహుకరించింది. ఈ సందర్భంగా నిహాల్‌ను ‘నవ్య’ పలకరించింది.

ఆ విశేషాలలోకి వెళ్తే...

‘‘మనం ఈ భూమి మీద పుట్టాం. కాబట్టి పుడమి తల్లికి చాలా రుణపడి ఉన్నాం. అయితే మనకు తెలియకుండానే కాలుష్యానికి కారణంగా మారుతున్నాం. ఇలాంటి కాలుష్య కారకాల్లో బ్యాటరీలు ప్రధానమైనవి. మూడేళ్ల క్రితం క్యాలిఫోర్నియా ఒక ప్రాంతంలో బ్యాటరీ పేలిందనే వార్త వచ్చింది. అప్పుడు నాకు పదేళ్లు. ఈ వార్తను చదివిన తర్వాత బ్యాటరీల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. ప్రతి ఏడాది మన భూమి మీద 1500 కోట్ల బ్యాటరీలు వ్యర్థాలుగా మారుతూ ఉంటాయి. వీటిలో ఎక్కువ శాతం భూమిలో కలిసిపోతాయి. వీటిని ఎవరూ రీసైక్లింగ్‌ చేయరు. ఇలా మరి కొద్ది కాలం కొనసాగితే ఈ భూమికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ‘రీసైకిల్‌ మై బ్యాటరీ’ అనే సంస్థను స్థాపించాను. ఈ సంస్థను స్థాపించేముందు బ్యాటరీలకు సంబంధించిన అనేక వివరాలను తెలుసుకొని నాన్నను ఒప్పించా. అలా ప్రారంభమయిన మా సంస్థకు మంచి ఆదరణ లభించటం మొదలయింది.

ప్రస్థానం ఇలా..

ఈ సంస్థను స్థాపించిన తర్వాత మేము అనేక స్కూళ్లకు వెళ్లేవాళ్లం. అక్కడ పిల్లలకు బ్యాటరీల వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే వాళ్లం. చాలా సందర్భాలలో నా వయస్సు పిల్లలు వెంటనే స్పందించేవారు. మా సంస్థలో చేరేవారు. ఇలా మూడేళ్లలో మాకు 300 మంది వలంటీర్లు చేరువయ్యారు. వీరందరూ తమ తమ ప్రాంతాల్లో- బ్యాటరీలను సేకరించి- స్కూళ్లలో ఉన్న బ్యాటరీ బిన్స్‌లో వేస్తారు. ఇప్పటిదాకా... ఈ మూడేళ్లలో మేము 2.25 లక్షల బ్యాటరీలు సేకరించి- వాటిని రీసైక్లింగ్‌కు ఇవ్వగలిగాం. ఈ మా ప్రస్థానంలో నాన్నది ప్రత్యేకమైన పాత్ర. మొదట్లో ఆయన నన్ను చాలా ప్రొత్సహించారు. నాతో పాటు పనిచేసే వలంటీర్ల తల్లితండ్రులు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అమెరికాలో విధాన నిర్ణయాలు తీసుకొనే కాంగ్రెస్‌ సభ్యుల వద్దకు ఈ అంశాలను తీసుకువెళ్తున్నారు.

Srinihal.jpg

అనేకమంది చేరుతామంటున్నారు, కానీ...

సీఎన్‌ఎన్‌ అవార్డు రావటం చాలా ఆనందంగా అనిపించింది. ఈ అవార్డు వల్ల మేము చేస్తున్న పని ప్రపంచానికి తెలిసింది. కాబట్టి మరింత మంది పిల్లలు మా సంస్థలో చేరతారని భావిస్తున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మేము చేస్తున్న పనిని ఈ ప్రపంచానికి చెప్పటం కోసం మేము సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నాం. మా సంస్థకు సంబంధించిన బ్లాగ్‌లలో అనేక విషయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అమెరికాలో మా సంస్థ చేస్తున్న సేవను చూసి.... ఆంధ్ర, తెలంగాణాలకు చెందిన అనేక మంది పిల్లలు దీనిలో చేరతామని అడుగుతున్నారు. నాలాంటి పిల్లలు బ్యాటరీలు సేకరిస్తారు సరే... వాటిని ఎవరు రీసైకిల్‌ చేస్తారు? ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఈ మఽధ్య తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అమెరికా వచ్చినప్పుడు కలిసి- ఒక ప్రజంటేషన్‌ ఇచ్చాను. ఆయన ఈ ఆలోచనను చాలా మెచ్చుకున్నారు. తెలంగాణలో కూడా స్కూలు పిల్లలు బ్యాటరీలు సేకరించటానికి.. వాటిని రీసైక్లింగ్‌ చేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా ఈ ఆలోచనను చెప్పాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి విద్యార్థి ఇలాంటి ఏదో ఒక కార్యక్రమంలో పాలుపంచుకుంటే ప్రకృతిని రక్షించటంలో మన వంతు పాత్ర పోషించినట్లే!’’

నాలుగేళ్ల క్రితం నేను విజయవాడలోని మా తాతగారింటికి వచ్చా. ఉదయమే లేచి ఇందిరాగాంధీ స్టేడియంలో వాకింగ్‌ చేసేవాళ్లం. ఆ జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. ఇక ఇప్పటికీ నేను మర్చిపోలేని విషయం- గత ఏడాది టెడ్‌ టాక్‌లో ప్రసంగించటం. ఇదే విధంగా సీఎన్‌ఎన్‌ అవార్డు కూడా ఒక మరువరాని అనుభవం. ఇది అంతర్జాతీయంగా లభించిన గౌరవం కాబట్టి అనేక మందికి మా సంస్థ గురించి... మేము చేస్తున్న పని గురించి తెలిసే అవకాశం ఉంది. నిహాల్‌ తండ్రి వంశీ కృత్రిమ మేధకు సంబంధించిన కంపెనీ వ్యవస్థాపకుడు. తల్లి దీపిక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. సోదరి నిత్య స్కూల్లో చదువుతోంది.

సివిఎల్‌ఎన్‌

Updated Date - 2022-12-18T11:10:16+05:30 IST