Vijay Diwas: డిసెంబర్ 16 వస్తే చాలు పాక్ ఉలిక్కిపడుతుంది. ఎందుకో తెలుసా?
ABN , First Publish Date - 2022-12-16T19:19:02+05:30 IST
లొంగిపోయిన 93 వేల మంది పాక్ సైనికులను భారత్ వదిలిపెట్టింది.
న్యూఢిల్లీ: 1971 డిసెంబర్ 16న భారత్(India) బంగ్లాదేశ్ (Bangladesh)కు విమోచనం (Liberation) కల్పించింది. నాటి యుద్ధంలో పాకిస్థాన్ (Pakistan)ను చిత్తుగా ఓడించి సత్తా చాటింది. భారత యుద్ధవీరుల పరాక్రమానికి గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 16ను విజయ్ దివస్ (Vijay Diwas) గా జరుపుకుంటున్నాం.
డిసెంబర్ 4న ప్రారంభమైన ఈ యుద్ధం జరిగింది కేవలం 13 రోజులే. డిసెంబర్ 16న ముగిసింది. ఏకకాలంలో తూర్పు, పశ్చిమ ఫ్రాంటియర్లలో భారత్ తన ఆధిక్యతను చాటింది. పాకిస్థాన్ ఈస్టర్న్ కమాండ్ కమాండర్ లెఫ్టెనెంట్ జనరల్ ఏఏకే నియాజీ తన 93 వేల మంది పాక్ సైనికులతో కలిసి భారత ఈస్టర్న్ కమాండర్ లెఫ్టెనెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా ఎదుట బేషరతుగా లొంగిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు లొంగిపోవడం ఇదే ప్రథమం. ఫీల్డ్ మార్షల్ మానెక్‌షా తన వ్యూహాలతో విజయంలో కీలక పాత్ర పోషించారు. నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ విమోచనలో కీలక పాత్ర పోషించారు.
1947లో భారత్-పాకిస్థాన్‌లు విడిపోయాయి. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ ఉన్న ప్రాంతంతో పాటు ప్రస్తుతం బంగ్లాదేశ్ ఉన్న ప్రాంతం (తూర్పు పాకిస్థాన్) కూడా పాక్‌లో భాగంగా ఉండేవి. ప్రస్తుతం పాకిస్థాన్ ఉన్న ప్రాంతం నుంచే తూర్పు పాకిస్థాన్‌లో పాలన సాగేది. రెండు ప్రాంతాల మధ్య భౌగోళికంగా దూరం ఎక్కువగా ఉండేది. తొలి నుంచే సమస్యలు తీవ్రంగా ఉండేవి. ఇస్లామాబాద్ మాటే చెల్లుబాటు అయ్యేది. పాలనలో ముఖ్యమైన స్థానాల్లో అధికారులంతా ఇస్లామాబాద్ నుంచే నియమితులయ్యేవారు. ఢాకాను పట్టించుకోలేదు. పైగా బెంగాళీ భాష మాట్లాడే తూర్పు పాకిస్థాన్ ప్రజలపై ఉర్దూను అధికారిక భాషగా బలవంతంగా ప్రకటించారు. దీంతో ప్రజలు రగిలిపోయారు. ఆ సమయంలో అవామీలీగ్ స్థాపించిన షేక్ ముజిబీర్ రహమాన్ ( బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా తండ్రి) ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో 162 స్థానాలకు గాను 160 స్థానాల్లో విజయం సాధించారు. పశ్చిమ పాకిస్థాన్‌లో జరిగిన ఎన్నికల్లో జుల్ఫికర్ అలీ భుట్టో 138 స్థానాలకు గాను 81 స్థానాల్లో మాత్రమే గెలిచారు. 1971 మార్చ్ 25న తూర్పు, పశ్చిమ పాకిస్థాన్‌కు ముజిబీర్ రహమాన్‌ను ప్రధానిగా ప్రకటించాల్సింది పోయి పాక్ సైన్యం ప్రజలపై అరాచకాలు ముమ్మరం చేసింది. తూర్పు పాకిస్థాన్‌లో ఉన్న హిందువులపైన, మైనార్టీలపైన పాక్ సైన్యం అరాచకాలు పెరిగిపోయాయి. మూడు నుంచి ఐదు లక్షల మంది పౌరులు పాక్ సైన్యం అరాచకాలకు బలైపోయారు. బంగ్లాదేశ్ అధికారిక లెక్కల ప్రకారం పాక్ సైన్యం అరాచకాలతో 30 లక్షల మంది చనిపోయారు. కనీసం కోటి మంది ప్రజలు బాధితులుగా మారి తూర్పు పాకిస్థాన్ నుంచి భారత్‌కు శరణార్ధులుగా వచ్చారు. ఆ సమయంలో ప్రధాని ఇందిర తూర్పు పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచారు.
తూర్పు పాకిస్థాన్‌కు ఇందిర మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని పాకిస్థాన్ డిసెంబర్ 3న భారత్‌లోని 11 ఎయిర్‌బేస్‌లపై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. అమృత్‌సర్, పఠాన్‌కోట్, శ్రీనగర్, అవంతిపుర, అంబాలా, సిర్సా, ఆగ్రా తదితర ప్రాంతాల్లో వైమానిక స్థావరాలపై పాక్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. దీంతో డిసెంబర్ 4న పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ మానెక్‌షా భారత సైన్యానికి నేతృత్వం వహించారు. భారత్‌లోని మూడు సైనిక విభాగాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఏకమై పోరాడి విజయం సాధించాయి.
డిసెంబర్ ఆరున బంగ్లాదేశ్‌ను భారత్ స్వతంత్ర దేశంగా గుర్తించింది. రెండు రోజుల తర్వాత భారత నేవీ కరాచీపై దాడి చేసింది. డిసెంబర్ 12 నుంచి 16 వరకూ భారత బలగాలు ఢాకాలోకి దూసుకుపోయాయి. సంపూర్ణ విజయం సాధించాయి.
నాటి యుద్ధంలో 3,800 మంది భారత్, పాక్ సైనికులు చనిపోయారు. 9851 మంది గాయపడ్డారు. లొంగిపోయిన 93 వేల మంది పాక్ సైనికులను షిమ్లా ఒప్పందంతో భారత్ వదిలిపెట్టింది. అయితే 93 వేల మంది పాక్ సైనికుల విడుదలకు కశ్మీర్ విషయంతో ముడిపెట్టి ఉంటే ఈ రోజున అక్కడ రావణకాష్టం ఉండేది కాదని, పూర్తి స్థాయిలో శాంతి నెలకొనేదని అంతర్జాతీయ పరిశీలకులు అభిప్రాయపడుతుంటారు.