బావిలో పడిందేమోనని రెస్క్యూ ఆపరేషన్.. ఇంట్లో హాయిగా నిద్రపోయిన పదేళ్ల బాలిక..!
ABN , First Publish Date - 2022-12-15T17:30:26+05:30 IST
తమ కూతురు బావిలో పడిందన్న వార్త వినగానే తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బాలిక కుటుంబంతో పాటూ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు..
తమ కూతురు బావిలో పడిందన్న వార్త వినగానే తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. బాలిక కుటుంబంతో పాటూ గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. రెస్క్యూ బృందంతో పాటూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో పడిన బాలికను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు స్థానికులంతా టెన్షన్ టెన్షన్‌గా ఎదురు చూస్తున్నారు. ఇంతలో సదరు బాలిక ఇంట్లో హాయిగా నిద్రపోతోందని తెలిసింది. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రెండో పెళ్లి కావడం లేదని దిగులు.. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సత్నా పరిధి రాంనగర్ సమీపంలో జగనాగ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామ్ నరేష్ సింగ్ అనే వ్యక్తికి పదేళ్ల సెజల్ సింగ్ అనే కుమార్తె ఉంది. కాగా, బుధవారం గ్రామ సమీపంలోని బావి వద్ద పాప సెజల్ దుస్తులు, చెప్పులు పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ప్రమాదవశాత్తు బావిలో పడిందేమో అని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ వార్త వినగానే బాలిక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. లబోదిబోమంటూ బావి వద్దకు చేరుకున్నారు. కొద్ది నిముషాల్లో ఈ వార్త గ్రామం మొత్తం వ్యాపించింది. ప్రజలంతా అక్కడికి చేరకుని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు.. గ్రామానికి రెస్క్యూ సిబ్బందిని (Rescue team) పంపించారు.
మధ్యాహ్నానికి గ్రామానికి చేరుకున్న సిబ్బంది.. బావిలోకి దిగి బాలికను రక్షించే ప్రయత్నాలు మొదలెట్టారు. నీటిని మొత్తాన్ని మోటార్లతో బయటికి తోడారు. అయినా బాలిక మాత్రం కనిపించలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఇంట్లో వెతకగా.. బాలిక ఒక్కటీ గదిలో మూలన పడుకుని కనిపించింది. దీంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు (police) బాలికను విచారించగా అసలు విషయం తెలియజేసింది. బాలిక బావి వద్ద స్నానం చేసేందుకు వెళ్లగా.. నీరు తోడే క్రమంలో పొరపాటున బకెట్ నీళ్లలో పడిపోయింది. తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారనే భయంతో సమీపంలోని పొలంలో దాక్కుంది. అంతా కంగారుగా బావిలో వెతుకుతుండడాన్ని గమనించి, తర్వాత ఇంటికి వెళ్లి గదిలో దాక్కుంది. మొత్తానికి బాలిక క్షేమంగా ఉండడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు.