Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’కు 100 రోజులు.. ఇప్పటివరకు రాహుల్‌పై టాక్ ఇదే !?

ABN , First Publish Date - 2022-12-16T19:54:13+05:30 IST

ఎటుచూసినా ఓటములు-వైఫల్యాలు, నేతల వలసల మధ్య కాంగ్రెస్ పార్టీ (Congress party) పనైపోయినట్టే!.. హస్తం పార్టీ ఇక కనుమరుగే!.. ఎవరూ బతికించలేరు!.. పురాతన పార్టీ మనుగడ అసాధ్యమే!.. అంటూ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రత్యర్థి పార్టీల హేళనలు-విమర్శలు, రాజకీయ నిపుణుల విశ్లేషణలతో ....

Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’కు 100 రోజులు.. ఇప్పటివరకు రాహుల్‌పై టాక్ ఇదే !?

టుచూసినా ఓటములు-వైఫల్యాలు, నేతల వలసల మధ్య కాంగ్రెస్ పార్టీ (Congress party) పనైపోయినట్టే!.. హస్తం పార్టీ ఇక కనుమరుగే!.. ఎవరూ బతికించలేరు!.. పురాతన పార్టీ మనుగడ అసాధ్యమే!.. అంటూ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రత్యర్థి పార్టీల హేళనలు-విమర్శలు, రాజకీయ నిపుణుల విశ్లేషణలతో పార్టీ నాయకులు, నేతల్లో నైరాశ్యం ముసురుతున్న వేళ.. కేడర్‌, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం అడుగంటుతున్న తరుణాన.. ‘అండగా నేనున్నా..’ అంటూ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ‘భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra) రూపంలో కదం తొక్కారు. దేశం ఎదుర్కొంటున్న 1.ఆర్థిక అసమానతలు, 2. భారతీయ సమాజంలో చీలికలు, 3. మతోన్మాద, హానికర రాజకీయాలకు ప్రత్యమ్నాయం చూపుతానంటూ సెప్టెంబర్ 7న ఆయన వేసిన తొలి అడుగు శుక్రవారంతో (డిసెంబర్ 16, 2022) 100 రోజులు పూర్తిచేసుకుంది. తన తండ్రి రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురైన శ్రీపెరంబుదూర్‌లో నివాళులు అర్పించి ‘కలిసి అడుగేద్దాం.. దేశాన్ని ఐక్యం చేద్దాం’ అనే నినాదంతో ఈ యాత్రను మొదలుపెట్టారు. తమిళనాడులో మొదలై కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మీదుగా ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. 100 రోజుల్లో 2800 కిలోమీటర్లకుపైగా సాగిన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ విశేషాలను ఒకసారి పరిశీలిద్దాం..

భారత్ జోడో యాత్ర కింద కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల లక్ష్యం తలపెట్టుకున్న రాహుల్ గాంధీ ఇప్పటికే 2800 కిలోమీటర్లకుపైగా నడిచారు. తన యాత్ర ప్రధాని మోదీ ‘మన్‌కీ బాత్‌’ మాదిరిగా ఉండదని ఆరంభంలో చెప్పినట్టుగానే రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ ముందుకు సాగిస్తున్నారు. అన్ని వర్గాల సాధకబాధకాలు, వారి డిమాండ్లను ఆలకిస్తూ ముందుకు కదులుతున్నారు. యాత్ర సాగుతున్న ప్రాంతాల్లో అన్ని వర్గాలతో ఆయన మమేకమవుతున్నారు. రైతులు, శ్రామిక జీవులు, మహిళలు, యువత, ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, అవ్యవస్థీకృతరంగ కార్మికులు, అభిమానులు, సినీ, రాజకీయ రంగాల ప్రముఖలు, ఆఖరికి చిన్నారులు, విద్యార్థులు సహా సబ్బండ వర్ణాలతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే వందల కిలోమీటర్లు నడిచినా ఆయనలో ఏమాత్రం అలసట కనిపించడం లేదు. ఇక రాహుల్‌ యాత్రలో సోనియా, ప్రియాంక గాంధీలు కూడా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల యాత్రలో పాల్గొని కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. వీరికి తోడు బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పార్టీలో చేరడం, రాహుల్ గాంధీ ఫుట్‌బాల్ ఆడడం, నర్మదా ఘాట్‌ వద్ద రాహుల్-ప్రియాంక గాంధీల హారతి, ఒలింపిక్ మెడలిస్ట్, బాక్సర్ విజేందర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరడం, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కలవడం, కేజీఎఫ్ ఛాప్టర్-2 కాపీ రైట్స్ ఇష్యూ ఇవన్నీ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

యాత్రలో ఉండగా రాహుల్‌కు మిశ్రమ ఫలితాలు..

రాహుల్ భారత్ జోడో యాత్రలో ఉన్న సమయంలో జరిగిన కీలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మిశ్రమ ఫలితాలను చవిచూసింది. మొదటిది తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక. రాహుల్ యాత్ర రాష్ట్రంలో కొనసాగుతున్న సమయంలోనే వెల్లడైన ఇక్కడి ఫలితం కాంగ్రెస్‌కి ఘోరపరాభావాన్ని మిగిల్చింది. కనీస పోటీ ఇవ్వకుండానే సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకుంది. రాజగోపాల్ రాజీమానాతో అనివార్యమైన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పుకోదగ్గ పోటీ ఇవ్వలేకపోయినే విమర్శలు వ్యక్తమయ్యాయి. రెండవది.. అత్యంత కీలకమైన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో విజయవంతంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయం కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సహాన్ని నింపిదనడంలో ఎలాంటి సందేహం లేదు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ‘హిమాచల్ విజయం’లో దోహదపడిందని స్వయానా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. దీనినిబట్టి రాహుల్ యాత్రలో ఉన్న సమయంలో పార్టీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయని స్పష్టమవుతోంది.

కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపేనా?

రాహుల్ చేపడుతున్న ‘భారత్ జోడో యాత్ర’ ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. అన్నీ వర్గాల ప్రతినిధులు తమ సమస్యలను రాహుల్‌కు చెప్పుకుంటున్నారు. రాహుల్ కూడా వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా చెరగని చిరునవ్వు, రెట్టించిన ఉత్సాహం, ఆప్యాయ పలకరింపులతో ముందుకు సాగుతున్న రాహుల్ కాంగ్రెస్ మద్ధతుదారుల్లో ధైర్యం నింపుతున్నారు. రాహుల్ తన యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడంతోపాటు ప్రత్యర్థి పార్టీల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో సరికొత్త రాహుల్ గాంధీని పరిచయం చేసుకునేందుకు ఈ యాత్ర ఎంతగానో అక్కరకొస్తుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా వరుసగా ఓటములతో డీలా పడిన కాంగ్రెస్‌కు ఈ యాత్ర నూతనోత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని సామాన్యజనం కూడా అభిప్రాయపడుతున్నారు. కాగా మొత్తం 150 రోజుల్లో 3,570 కిలోమీటర్ల లక్ష్యం తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తదుపరి తదుపరి హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, చివరిగా జమ్ము-కాశ్మీర్‌లో ముగియనుంది. మరి రాహుల్ యాత్ర కాంగ్రెస్ పార్టీకి, దేశంలో రాజకీయ పరిస్థితులను ఏవిధంగా మార్చబోతోందో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-12-16T20:26:57+05:30 IST