Bangladesh vs India: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. భారత్ లీడ్ ఎంతంటే?
ABN , First Publish Date - 2022-12-23T16:17:41+05:30 IST
బంగ్లాదేశ్(Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు (Team India) తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
ఢాకా: బంగ్లాదేశ్(Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు (Team India) తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 314 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లాదేశ్‌పై 87 పరుగుల ఆధిక్యం సాధించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ (Shakib Al Hasan), తైజుల్ ఇస్లాం (Taijul Islam) చెరో నాలుగు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్‌కు కళ్లెం వేశారు. ఓవర్ నైట్ స్కోరు 19/0తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 27 పరుగులు వద్ద కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అవుటయ్యాడు. 10 పరుగులు మాత్రమే చేసిన రాహుల్‌ను తైజుల్ ఇస్లామ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాతి నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన భారత్‌కు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు.
జోరుగా ఆడి పరుగులు పెంచే ప్రయత్నం చేసిన పంత్ 105 బంతుల్లో 93 పరుగులు చేసి సెంచరీ ముంగిట అవుటయ్యాడు. పంత్ స్కోరులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. శ్రేయాస్ కూడా బ్యాట్‌కు బాగానే పని చెప్పాడు. 105 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి షకీబల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. వారి తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. ఫలితంగా 314 పరగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది. పుజారా 24, కోహ్లీ 24, అశ్విన్ 12, ఉనద్కత్ 14, ఉమేశ్ యాదవ్ 14 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబల్ హసన్, తైజుల్ ఇస్లామ్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులు చేసింది.