Police Jobs: ఎత్తు కోసం నెత్తిన ఎమ్ సీల్ పెట్టుకున్న యువతి.. చివరకు పోలీసులకు ఎలా దొరికిందంటే..
ABN , First Publish Date - 2022-12-14T18:35:07+05:30 IST
పోలీస్ కావాలన్న ఆమె లక్ష్యం గురితప్పింది. సరైన ఎత్తులేకున్నా ఎక్కడో ఓ చోట అదృష్టం కలిసివస్తుందని భావించిన ఆమె.. పోలీస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసింది...
పోలీస్ కావాలన్న ఆమె లక్ష్యం గురితప్పింది. సరైన ఎత్తులేకున్నా ఎక్కడో ఓ చోట అదృష్టం కలిసివస్తుందని భావించిన ఆమె.. పోలీస్ ఉద్యోగానికి (Police Jobs) దరఖాస్తు చేసింది. ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Examination) రాసి అర్హత సాధించింది. దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై కావాలంటే తన ఎత్తు సరిపోదని తెలుసు. ఎత్తు సరిపోవాలంటే నెత్తిన పైపుల లీకేజీలను అరికట్టేందుకు ఉపయోగించే ఎమ్ సీల్ (M Seal) మైనం ధరించి వెంట్రుకలతో కవర్ చేసుకొని పరీక్షలకు హాజరై దొరికిపోయింది. దీంతో అధికారులు డిస్‌క్వాలిఫై చేసి వెనక్కిపంపించిన ఈ ఘటన బుధవారం తెలంగాణ (Telangana) మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది.
స్థానిక స్టేడియం మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళల దేహదారుఢ్య పరీక్షలకు ఓ అభ్యర్థి హాజరైంది. ఎత్తులో అర్హత సాధించాలంటే 152.5 సెం.మీ. ఉండాలి. అయితే ఆ మహిళ ఎత్తు 149.5 సెం.మీ. ఉండటంతో అతితక్కువ ఎత్తులో అర్హత కోల్పోతానని భావించి ఓ ప్లాన్ చేసింది. తలలోని వెంట్రుకల కింద ఎమ్ సీల్ మైనంతో ఎత్తు పెంచుకునే ప్రయత్నం చేసింది. 800 మీటర్ల పరుగులో క్వాలిఫై అయిన అనంతరం ఎత్తు కొలిచే పరికరం దగ్గరకు వెళ్ళి నిలుచుంది. అయితే సాంకేతిక పరిజ్ఞానంతో ఈవెంట్లు నిర్వహిస్తుండటంతో కాళ్ళకింద, తలపైన సెన్సార్‌లను అమర్చుతున్నారు. కింద పాదం, పైన తల స్పర్శ సెన్సార్‌లకు తగిలితేనే అక్కడున్న డిజిటల్ మీటర్‌లో (Digital meter) ఎత్తు ఎంతనేది డిస్‌ప్లే అవుతుంది. అయితే సదరు మహిళ ఎత్తుకొలిచేందుకు ప్రయత్నించగా సెన్సార్‌లు మోగలేదు.
దారుణం.. 5 ఏళ్ల బాలుడి కాళ్లను పట్టుకుని.. గాల్లో గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు..!
ఒకట్రెండు సార్లు ప్రయత్నించిన పోలీస్ అధికారులు.. యువతి నెత్తిన క్లిప్‌లు ఎమైనా తగులుతున్నాయోనని చూసేందుకు తలపై చేయిపెట్టగా గట్టిగా తగలడంతో ఆమెను పరీక్షించారు. దీంతో తలపై ఎమ్ సీల్ పెట్టుకున్న విషయం బయటపడింది. వెంటనే ఎమ్ సీల్‌ను తొలగించారు. మోసం చేసే ప్రయత్నం చేసిన సదరు మహిళను డిస్‌క్వాలిఫై (Disqualify) చేశారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈవెంట్లు మొత్తం ఆర్‌ఎఫ్‌ఐడీ, సెన్సార్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నామని, ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదని చెప్పారు. అభ్యర్థి ప్రతి కదలిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుందని, అభ్యర్థులు అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.