Delhi Liquor Scam: ఏబీఎన్ చేతిలో కీలక ఆధారాలు
ABN , First Publish Date - 2022-12-16T13:09:13+05:30 IST
సీబీఐ ఛార్జిషీటును సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీబీఐ ఆరోపించిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ముడుపులు(kick backs) నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. అభిషేక్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ఛార్జిషీటు(CBI Charge Sheet)లో నిందితులపై కీలక అభియోగాలు నమోదయ్యాయి. సీబీఐ(CBI) వేసిన ఛార్జిషీటు ఏబీఎన్(ABN) చేతికి చిక్కింది. గురువారం సీబీఐ ఛార్జిషీటును సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీబీఐ ఆరోపించిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ముడుపులు(kick backs) నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. అభిషేక్ బోయిన్‌పల్లి(Abhishek Boinpally) 20 నుంచి 30 కోట్ల రూపాయల నగదును హవాలా మార్గంలో తరలించినట్లు ఛార్జిషీటులో వెల్లడించింది. ఆ డబ్బంతా అడ్వాన్స్‌గా 2021 జులై, సెప్టెంబర్ మధ్య కాలంలో ముట్టజెప్పినట్లుగా పేర్కొంది. రూ.30 కోట్లను దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్(Vijay Nair)కు అందజేసినట్లు తెలిపింది. దక్షిణాది ప్రాంతానికి చెందిన మద్యం ఉత్పత్తిదారుల తరపున అభిషేక్ బోయిన్‌పల్లి వ్యవహారం నడిపినట్లు తెలిపింది. శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనువాసులు రెడ్డి సౌత్ గ్రూప్‌ను కంట్రోల్ చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.
సీఐబీ దాఖలు చేసిన తొలి ఛార్జిషీటును ఆమోదించి నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కీలక అంశాలను ప్రస్తావించింది. మద్యం ఉత్పత్తిదారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఏ ఇద్దరి మధ్య ఎక్కడా గుత్తాధిపత్యం కానీ సమూహాలకు కానీ లబ్ధిచేకూర్చకూడదనే విధానాన్ని రూపకల్పన చేసినట్లుగా తెలిపింది. మద్యం పాలసీ రూపకూల్పన జరుగుతున్న సమయంలోనే నిందితులు కుట్రకు పాల్పడినట్లు తేటతెల్లచేసింది. 2021 జులై, సెప్టెంబర్ మధ్యలో రూ.30 కోట్లను అభిషేక్ బోయిన్‌పల్లి.. దినేష్ అరోరాకు అందజేశారని తెలిపింది. మొత్తం నగదును విజయ్ నాయర్‌కు అందజేసినట్లుగా స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులను ప్రభావితం చేసేందుకు హోల్‌సేల్ దారులకు 12 శాతం లాభాలు ఆర్జించేలా అందులో తిరిగి 6 శాతం అభిషేక్ బోయిన్‌పల్లికి తిరిగి వచ్చేలా కుట్ర చేశారని పేర్కొంది.
హోల్‌సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్రన్ పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్‌కు రూ.4,756 కోట్లు అందాయయని.. అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్‌పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా తెలిపింది. అంతేకాకుండా గౌతమ్‌కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టం చేసింది. మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది. కొందరు ప్రజా సేవకులు, ఇతర సంస్థలతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించింది. అడ్వాన్స్ కింది ముడుపులు, కిక్ బ్యాక్స్(kick backs) అందాయని తెలిపింది.
చట్ట విరుద్ధ లక్ష్యాలను సాధించేందుకు కుట్రకు సంబంధించిన అంశాలను ఛార్జిషీటులో సీబీఐ పొందుపరిచింది. సముచితమైన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాలను కూడా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు సంస్థలు సేకరించాయని సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వారిపైనా, పేర్లు లేనివారిపైనా కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఛార్జిషీటులో వెల్లడించింది.