Politics in Telangana : రగులుతున్న రాజకీయం
ABN , First Publish Date - 2022-11-10T03:59:57+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు.
మరో స్థాయికి చేరిన గులాబీ, కాషాయ పార్టీల వైరం
రాజ్యాంగ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థలే అస్త్రాలుగా పోరు
నా ఫోన్ ట్యాపింగ్!
ప్రభుత్వం చేయిస్తోందనే సందేహం కలుగుతోంది
నా ఫోన్ సమాచారం వారికెలా తెలుస్తుంది?.. ‘ఎమ్మెల్యేల’ కేసులోకి రాజ్‌భవన్‌ను లాగే యత్నం
ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానపరచడమే.. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనడం సరికాదు
బిల్లులను పరిశీలించాల్సిన అవసరం ఉంది.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వసతులు సరిగా లేవు
అత్యవసరంగా ప్రైవేటు వర్సిటీలెందుకు?.. మంత్రికి సమాచారం చేరడానికే ఇంత సమయమా?
ఇలాగైతే సామాన్యులు ప్రగతి భవన్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకొనేదెలా?
రాజ్‌భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.. ప్రగతి భవన్ మాదిరి కాదు: గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాజకీయం రగులుతోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్.. సై అంటే సై అంటున్నాయి. రాజకీయ ఆఽధిపత్య పోరులో రాజ్యాంగ వ్యవస్థలను అస్త్రాలుగా వాడుకుంటు న్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీపై పైచేయి సాధించేందుకు యత్నిస్తున్న టీఆర్‌ఎస్.. తాజాగా మరింత దూకుడు పెంచి, సిట్ వేసింది. అటు కేంద్రం.. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సహా పలువురు గ్రానైట్ వ్యాపారులపైకి ఈడీని సంధించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టి తన సందేహాలను నివృత్తి చేయాలన్న గవర్నర్.. తాజాగా తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో గవర్నర్ బీజేపీ ఏజెంటు అంటూ అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది. ఇక రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ప్రధాని రానుండడం కూడా రాజకీయ పోరుకు మరో వేదికగా మారింది. మోదీని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్వీ ప్రకటించగా.. టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయంటూ బీజేపీ నేతలు హెచ్చరించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనపై సుప్రీం పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసింది. భీమా కోరెగావ్ కేసు నిందితుల కన్నా అవినీతిపరులే దేశాన్ని ధ్వంసం చేస్తారని వ్యాఖ్యానించింది. ’
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందనే సందేహం కలుగుతోందన్నారు. లేదంటే తన ఫోన్‌లో ఉన్న సమాచారం వారికెలా తెలుస్తుందని ప్రశ్నించారు. కావాలంటే తన ఫోన్‌ను ఇస్తానని, వారికి కావాల్సినసమాచారం చూసుకోవచ్చని అన్నారు. తాను పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తానని చెప్పారు. మొయినాబాద్ ఫాంహౌ్‌సలో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులోకి రాజ్‌భవన్‌ను ఉద్దేశపూర్వకంగా లాగే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించడమేనన్నారు. బిల్లుల పెండింగ్‌కు తోడు రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో గవర్నర్ బుధవారం రాజ్‌భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘నా వద్దకు వచ్చే బిల్లులను ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తున్నాను. వాటిపై కొన్ని సందేహాలున్నాయి.. నివృత్తి చేసుకోవాల్సి ఉంది. యూనివర్సిటీల్లో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు వీసీలతో సమావేశం నిర్వహించాను. ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరాను.
వీసీ పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి. నేను పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాతే పోస్టులు భర్తీ చేశారు. యూనివర్సిటీలకు సంబంధించి నిర్వహించిన సమావేశాలు, చేపట్టిన పర్యటనల సమాచారం పూర్తిగా నా వద్ద ఉంది. ఇప్పుడు కొత్తగా నియామక బోర్డు అవసరం ఎందుకు ఏర్పడింది? నియామకాల్లో ఏ విధానాలు అనుసరిస్తారు? బోర్డు యూజీసీ నిబంధనలకు లోబడి ఉంటుందా? ప్రతి ఏటా నియామకాలు ఉంటాయా? బోర్డు ఏర్పాటుకు ఎంత సమయం పడుతుంది? ఎనిమిదేళ్లుగా వీసీలను నియమించకపోతే ఆందోళన చేయని జేఏసీలు.. ఇప్పుడెందుకు ఆందోళన చేస్తామంటున్నాయి?’’ అంటూ గవర్నర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలో సరైన మౌలిక సదుపాయాలు లేని విషయాన్ని తన పర్యటనలో గుర్తించానన్నారు. విద్యార్థులు పడుకునే బెడ్‌లపై పరుపులు సరిగా లేవని, కొన్నిచోట్ల రాత్రివేళ విద్యార్థులు చదువుకునేందుకు ట్యూబ్‌లైట్ సదుపాయం కూడా లేదని అన్నారు. ప్రభుత్వ మెస్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇన్ని సమస్యలు పక్కనబెట్టి ప్రైవేటు యూనివర్సిటీలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందని ప్రశ్నించారు. ముందుగా పేద విద్యార్థులు, ప్రభుత్వ యూనివర్సిటీల గురించి ఆలోచించి ఆ తర్వాత ప్రైవేటు యూనివర్సిటీల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఖైదీల క్షమాభిక్ష బిల్లు సరిగా లేకపోవడంతో వెనక్కి పంపించానని తెలిపారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను పాటించకుండా బిల్లును రూపొందించారని చెప్పారు.
సమాచారం వెళ్లడానికే ఇంత సమయమా?
నెలల తరబడి తన వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రచారం చేయడం సరికాదని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రభుత్వం పంపిన బిల్లులు కేవలం నెల రోజులకు పైగా మాత్రమే తన వద్ద ఉన్నాయని, కానీ.. ఆరేడు నెలలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మంత్రికి లేఖ వెళ్లేందుకే ఇంత సమయం పడితే.. సాధారణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు ఇంకెంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఇప్పుడు కొందరు ప్రొటోకాల్ గురించి మాట్లాడుతున్నారన్న గవర్నర్.. తన పర్యటన సమయంలో ప్రొటోకాల్ పాటించని అధికారులపై, స్వాగతం పలికేందుకు రాని కలెక్టర్, ఎస్పీలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు. ఉద్దేశపూర్వకంగా రాజ్‌భవన్ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని గవర్నర్ ఆరోపించారు.
అగ్నిపథ్ నిరసనల సమయంలోనూ అధికార పార్టీకి చెందిన కొందరు.. రాజ్‌భవన్ ముందుకు వెళ్లి ఆందోళన చేయాలంటూ వ్యాఖ్యానించారని తెలిపారు. నిన్నగాక మొన్న మరో విషయంలోనూ అదే చెప్పారని పేర్కొన్నారు. రాజ్‌భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఇది ప్రగతి భవన్ కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా, ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని అన్నారు. పలు యూనివర్సిటీల విద్యార్థులు వచ్చి వారి సమస్యలను తన దృష్టికి తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో రాజ్‌భవన్ ప్రమేయం ఉందనడం సరికాదన్నారు. తన మాజీ ఏడీసీ తుషార్ పేరును తెరపైకి తేవడం వెనక రాజ్‌భవన్‌ను ఇందులోకి లాగాలనే ఉద్దేశం ఉందన్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన తుషార్ తనకు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేసినరోజే ఉద్దేశపూర్వకంగా రాజ్‌భవన్ పేరును ప్రస్తావించారని, తన ఫోన్‌లో సమాచారం వారి వద్దకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన ఒకరు ట్విటర్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారని తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని సందేహంగా ఉందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనన్నారు.
బేస్ పెంచి.. పత్రాలు వెంట తెచ్చి.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై మూడేళ్ల కాలంలో పలు సందర్భాల్లో మీడియా సమావేశాలు నిర్వహించారు. కానీ, బుధవారం నిర్వహించిన సమావేశం గతం కంటే కొంత భిన్నంగా ఉంది. మాటల్లో బేస్ పెంచి మాట్లాడిన గవర్నర్.. ఆయా సందర్భాల్లో తాను ప్రభుత్వానికి పంపిన లేఖలు, తన సమావేశాలకు సంబంధించిన పత్రాలపే వెంట తీసుకువచ్చారు. మాటల సందర్భంగా అవసరమైన పత్రాలను మీడియా ముందు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఇటీవలి తన ఢిల్లీ పర్యటన ఎప్పటిలాగే సాధారణ పర్యటనేనని చెప్పారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లయిన సందర్భంగా ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, తదతర అంశాలకు సంబంధించి రూపొందించిన బుక్‌ను కేంద్ర హోంమంత్రికి అందజేశానప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ఫోన్ ట్యాపింగ్ అంశాల గురించి కూడా ఆ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.
ఎవరీ తుషార్..?
తుషార్.. ఫాంహౌ్‌సలో ఎమ్మెల్యేల బేరసారాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి చెప్పిన పేరు ఇది. సీఎం కేసీఆర్ కూడా విలేకరుల సమావేశంలో తుషార్ పేరు వెల్లడించారు. తాజాగా గవర్నర్ తమిళిసై ఎమ్మెల్యేల బేరసారాల కేసులో ఉద్దేశపూర్వకంగా రాజ్‌భవన్‌ను లాగేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఇంతకు సీఎం చెప్పిన తుషార్, గవర్నర్ చెబుతున్న తుషార్ ఒక్కరేనా లేక వేర్వేరా? అనేది తేలడం లేదు. మొయినాబాద్ ఫాంహౌ్‌సలో నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాల సమయంలో రామచంద్ర భారతి తుషార్ పేరు ప్రస్తావించారు. కేరళలోని వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి తుషార్.. ఇతను ఒకటే అంటూ కేసీఆర్ వెల్లడించారు. తన వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రోజే.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పేరును బహిర్గతం చేసిందని గవర్నర్ విమర్శించారు