Sharmila: పాదయాత్ర ఆపాలని నాపై ఒత్తిళ్లు.. ఒప్పుకోనందుకే బస్సు తగలబెట్టారు
ABN , First Publish Date - 2022-12-03T19:44:09+05:30 IST
టీఆర్ఎస్ నేతలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ నేతలు తాలిబన్ల వలే మాట్లాడుతున్నారని, అందుకే ఆ పార్టీని తాలిబన్ల రాష్ట్ర సమితి అన్నానని షర్మిల తెలిపారు. రౌడీలు, గూండాల్లా వ్యవహరిస్తున్నారని, కేసీఆర్‌కు కడుపు నొస్తే తెలంగాణకే నొప్పి కలిగినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇది కరెక్ట్ కాదు కదా అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను పార్టీ నుంచి వెళ్లగొట్టి.. ద్రోహులనే పార్టీలోకి చేర్చుకున్నారని, అసలు పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగిస్తున్నారని షర్మిల విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, కాళేశ్వరంపై మేం బేసిక్స్ స్టడీ చేశామని వైఎస్ షర్మిల అన్నారు. ప్రొటెక్షన్ వాల్ కూడా సరిగా కట్టలేదని, కాంట్రాక్ట్‌ల పేరుతో దోచుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. అందుకే టీఆర్‌ఎస్ బందిపోటుల పార్టీ అని, తనపై పరువునష్టం దావా వేస్తే వేసుకోండి అని షర్మిల అన్నారు.
నిరుద్యోగుల తరపున దీక్ష చేస్తే కేటీఆర్ అవహేళనగా మాట్లాడారని, ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబాల పరామర్శకు వెళితే అడ్డుకున్నారని షర్మిల మండిపడ్డారు. కొందరు బాధితుల కుటుంబీకులను దాచిపెట్టారని, కేసీఆర్ నోరు తెరిస్తే బూతులు తిడతారని వైఎస్ షర్మిల విమర్శించారు. నన్ను మరదలు అని ఓ మంత్రి అంటే తప్పు కాదంట.. నీవెవడ్రా నన్ను అనడానికి అంటే తప్పంటా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర ఆపాలని తనపై ఒత్తిళ్లు చేశారని, తాను ఒప్పుకోలేదు కాబట్టే బస్సు తగలబెట్టారని షర్మిల ఆరోపించారు. పాదయాత్ర వద్దని ముగ్గురు ఏసీపీలు పదేపదే అన్నారని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా తీసుకొచ్చారని షర్మిల అన్నారు. అవినీతి జరిగిన ప్రతిచోట మేం మాట్లాడుతున్నామని షర్మిల చెప్పారు.