YS Sharmila: నా గతం.. వర్తమానం.. భవిష్యత్ అంతా ఇక్కడే
ABN , First Publish Date - 2022-12-01T13:56:34+05:30 IST
కేసీఆర్ డైరెక్షన్‌లో పాదయాత్రను ఆపాలని చూశారని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు.
హైదరాబాద్: కేసీఆర్ (Telangana CM KCR) డైరెక్షన్‌లో పాదయాత్రను ఆపాలని చూశారని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) విమర్శించారు. గురువారం గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamili sai)తో భేటీ అయిన షర్మిల... పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పోలీసులే నర్సంపేట పాదయాత్రలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. ప్రభుత్వ సర్వేల్లో వైఎస్సార్టీపీ (YSRTP)కి ఆదరణ పెరిగిందని తేలిందన్నారు. కావాలనే తన పాదయాత్రను నర్సంపేటలో అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్టీపీ కార్యకర్తలను ఇష్టానుసారంగా కొట్టారని మండిపడ్డారు. అరెస్ట్ చేస్తేనే తప్ప పాదయాత్ర ఆగదని పోలీసులకు అర్థమైందని.. అందుకే తనను రిమాండ్‌కు పంపాలని చూశారన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘన కేసులో రిమాండ్‌కు పంపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ (TRS Chief) ఓ దొర మాదిరిగా పాలిస్తున్నారని వైఎస్సార్టీపీ అధినేత్రి విమర్శించారు.
కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారు..?
రాష్ట్రంలో కాంట్రాక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. దేశంలో అత్యంత ధనవంతమైనది కేసీఆర్ కుటుంబమన్నారు. ఎమ్మెల్సీ కవిత పేరు లిక్కర్ స్కామ్‌లో ఉందని.. ప్రగతిభవన్‌లో రైడ్స్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ ఇళ్లపై దాడులు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. పాదయాత్ర చేస్తే దాడులు తప్పవని హెచ్చరిస్తున్నారని తెలిపారు. అవినీతిని ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టడం అవుతుందా అని ప్రశ్నించారు. ‘‘చెప్పుతో కొడుతా అని కేవలం ఒక మంత్రిని మాత్రమే అన్నాను. కేటీఆర్ భార్య ఎక్కడి నుంచి వచ్చారు.. ఆంధ్రా నుంచి కాదా?. విడాకులు తీసుకోమని మేం అడుగుతున్నామా?. నేను ఇక్కడే చదివా.. ఇక్కడే పెళ్లి చేసుకున్నా.. ఇక్కడే కొడుకుని కన్నా.. నా గతం.. వర్తమానం.. భవిష్యత్ అంతా ఇక్కడే’’ అని షర్మిల స్పష్టం చేశారు.
మాకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత...
మునుగోడు, హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ ఖర్చుపై విచారణ జరగాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై కూడా విచారణ జరగాలని పట్టుబట్టారు. తెలంగాణలో అవినీతిపై సుప్రీంకోర్టుకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే అని వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు... మా కార్యకర్తలకు ఏం జరిగినా కేసీఆర్‌దే బాధ్యత’’ అని వైఎస్ షర్మిల హెచ్చరించారు.