Jodo Yatra : రాహుల్‌ రన్నింగ్‌!

ABN , First Publish Date - 2022-10-31T05:14:33+05:30 IST

భారత్‌ జోడోయాత్ర ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్‌గాంధీ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 53వ రోజు జోడో యాత్రలో రాహుల్‌ పిల్లలతో ..

Jodo Yatra : రాహుల్‌ రన్నింగ్‌!

పిల్లలతో కలిసి పరుగెత్తిన కాంగ్రెస్‌ అగ్రనేత.. 53వ రోజు జోడో యాత్రలో జోష్‌

ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగిన రాహుల్‌ గాంధీ

‘రాహుల్‌.. కాబోయే ప్రధాని’ అన్న ఏపీ విద్యార్థిని.. బతుకమ్మ ఆడిన రాహుల్‌

రాజగోపాల్‌రెడ్డి ‘బొగ్గు కాంట్రాక్టు’ ఆధారాలు వెల్లడించిన మధుయాష్కీ

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారత్‌ జోడోయాత్ర ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్‌గాంధీ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. 53వ రోజు జోడో యాత్రలో రాహుల్‌ పిల్లలతో కలిసి పరుగెత్తడం అందరినీ ఆకర్షించింది. రాజాపూర్‌ సమీపంలో రాహుల్‌ గాంధీ చిన్నారులు ఆఫ్రాన్‌, అమీర్‌తో ముచ్చటించారు. రోజూ మార్నింగ్‌ వాక్‌ చేస్తారా.. అని వారిని అడిగారు. తన తో రన్నింగ్‌ చేస్తారా? అని ప్రశ్నించిన రాహుల్‌.. పరుగుపందెం పెట్టుకుందామా అని అడిగారు. చిన్నారులు సరే అన్నారు. అంతే వారితో కలిసి పరిగెత్తారు. దాదాపు 100 మీటర్ల మేర రాహుల్‌ పరుగుపెట్టారు. ఆయన వెనక చిన్నారులు, రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు పరుగులెత్తారు. వారంతా రాహుల్‌తోపాటు వేగంగా పరుగెత్తలేకపోయారు. 53వ రోజు జోడో యాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి లలితాంబిక ఆలయం నుంచి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని సోలీపూర్‌ జంక్షన్‌ వరకు కొనసాగింది. ఉదయం 6 గంటలకు మొదలైన పాదయాత్ర నాన్‌స్టా్‌పగా 7.24 గంటల వరకు కొనసాగి, రాజాపూర్‌ వద్ద టీ బ్రేక్‌కు ఆపారు.

అక్కడ నాయకులతో కలిసి తేనీరు సేవించిన రాహుల్‌.. తిరిగి 8.08 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి రంగారెడ్డిగూడ స్టేజీ మీదుగా నడుస్తూ 9.27 గంటలకు పెద్దాయపల్లి స్టేజీ వద్దకు చేరారు. అక్కడ పాదయాత్రను ఆపి మధ్యాహ్న శిబిరానికి వెళ్లారు. రాహుల్‌ గాంధీతో పాటు ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీగౌడ్‌, కొండా సురేఖ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, కూతురు విజయతో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో నాయకులు, ప్రయాణికులు, తనను కలవడానికి వచ్చిన సంఘాల నాయకులతో రాహుల్‌ ముచ్చటిస్తూనే ఉన్నారు. పిల్లలు కనిపిస్తే వారిని దగ్గరకు తీసుకొని మాట్లాడి, చాక్లెట్లు ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇందిరాగాంధీ కుటుంబ అభిమాని ఇందుశ్రీ పాదయాత్రలో రాహుల్‌ని కలిశారు.

  • ఆదివారం పాదయాత్రలో రాహుల్‌ను జానారెడ్డి కలిశారు. ఆయనతో కలిసి కొద్దిసేపు నడిచారు. నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాదయాత్రలో నడిచారు.

  • తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, కార్యద ర్శి వెంకటేశ్వరమ్మ రాహుల్‌తో కలిసి నడిచి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

  • ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌ నాయక్‌, కోట శ్రీనివాస్‌ గౌడ్‌ రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులైతే కేసీఆర్‌ ప్రభుత్వం 400 మందినే గుర్తించిందని వివరించారు. ఈ అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలని రేవంత్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్‌కు రాహుల్‌ సూచించారు. ఉస్మానియా రీసెర్చ్‌స్కాలర్స్‌తో సమ్మేళనం ఏర్పాటు చేయాలని రేవంత్‌కు చెప్పారు.

  • ఏపీలోని నెల్లూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని జి.కార్తీక రోడ్డుపక్కన నిలబడి గొంతెత్తి అప్‌కమింగ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ రాహుల్‌గాంధీజీ అంటూ నినాదాలు చేయడం విన్న రాహుల్‌.. ఆమె వద్దకు వెళ్లి ఈ నినాదం చేయడానికి గల కారణమేంటని అడిగారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని, దేశానికి కాంగ్రెస్‌ అవసరమవని చెప్పారు. గ్రాము బంగారంతో తయారు చేసిన ఇందిరాగాంధీ బొమ్మను ఆమె రాహుల్‌కు అందించారు.

  • టీ బ్రేక్‌ సమయంలో బతుకమ్మ నృత్య ప్రదర్శనను రాహుల్‌ గాంధీ తిలకించారు. మహిళలతో కలిసి రాహుల్‌ ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.

రాజగోపాల్‌ కాంట్రాక్టుకు ఆధారాలివిగో

‘‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మునుగోడు బీజేపీ అఽభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి జనానికి పేలాలిచ్చి, ఆయన బిర్యానీ తింటున్నారు. రాజకీయ లబ్ధి, వ్యాపార వృద్ధి కోసమే ఆయన పార్టీ మారారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు’’ అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ ఆరోపించారు. జోడోయాత్ర మధ్యాహ్న శిబిరం ఏర్పాటు చేసిన బాలానగర్‌ మండలం పెద్దాయిపల్లి వద్ద ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆపరేషన్‌ బొగ్గు పేరుతో డాక్యుమెంట్లను విడుదల చేశారు. ఝార్ఖండ్‌లో చంద్రగుప్త బొగ్గు గనిని తొలుత కాంట్రాక్ట్‌ పొందిన అదానీ గ్రూప్‌ను కాదని, రెండో టెండర్‌లో రాజగోపాల్‌రెడ్డి భార్య, కుమారుడికి చెందిన సుశీ ఇన్‌ఫ్రాకు బీజేపీ కేటాయించిందని ఆరోపించారు. రాజ్‌గోపాల్‌రెడ్డి ఇచ్చే రూ.50 వేలు, రూ.లక్ష ఆయన ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని, ప్రజలు నమ్మి గెలిపిస్తే దాన్ని అమ్ముకొని సంపాదించిన డబ్బు ఇస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీ, టీఆర్‌ఎ్‌సకు దవడ పగిలేలా తీర్పునివ్వాలని కోరారు.

Updated Date - 2022-10-31T05:14:36+05:30 IST