TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-10-29T14:36:56+05:30 IST

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (Moinabad farmhouse)‌లో ఎమ్మెల్యేల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌ కేసును దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడబోమని ప్రకటించారు.

TRS MLAs Purchase: ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR

నల్లగొండ: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ (Moinabad farmhouse)‌లో ఎమ్మెల్యేల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్‌ కేసును దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడబోమని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున స్పందించమని చెప్పారు. సీఎం కేసీఆర్ (CM KCR) సరైన సమయంలో స్పందిస్తారని తెలిపారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం కావని, చెప్పులు మోసిన చేతులతో ప్రమాణాలు చేయడం తగదని ఆయన హితవుపలికారు. బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ప్రమాణంతో యాదాద్రి ఆలయం మలినమైందని ఎద్దేవాచేశారు. యాదాద్రి ఆలయాన్ని సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. 8 ఏళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని తప్పుబట్టారు. బీజేపీ (BJP) దివాళాకోరు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. మునుగోడు ఉపఎన్నికలో అసాధారణ పరిస్థితి కనిపిస్తోందన్నారు. బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, ఫ్లోరోసిస్ సమస్యపై బీజేపీ ఎందుకు స్పందించలేదు? అని కేటీఆర్ ప్రశ్నించారు. మిషన్ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలని.. నీతి అయోగ్ సిఫార్సు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.

ఏ ప్రధాని చేయని తప్పు నరేంద్ర మోదీ చేశారు

‘‘నల్లగొండ జిల్లాను బీజేపీ పట్టించుకోలేదు. ఏ ప్రధాని చేయని తప్పు నరేంద్ర మోదీ చేశారు. చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనే. మునుగోడును రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) అనాధలా వదిలేశారు. తెలంగాణ (Telangana)లో హ్యాండ్లూమ్ పార్క్ కట్టలేదు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు రుణాలు ఆపారు. కృష్ణా జలాల పంపకాల్లో నికృష్ణమైన రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కూ జాతీయ హోదా ఇవ్వలేదు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు. నోట్ల రద్దు పనికిమాలిన నిర్ణయం. ముడి చమురు ధర పెరగలేదు కానీ.. మోదీ చమురు ధర పెరిగింది. ఐదేళ్లుగా గిరిజన రిజర్వేషన్లపై తాత్సారం చేస్తోంది. గిరిజన యూనివర్సిటీలను ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలు అంటున్నారు. కార్పొరేట్ దోస్తుల కోసమే బీజేపీ పనిచేస్తోంది. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ ఇవ్వలేదు. మోదీ హయాంలోనే రూపాయి పతనం అయ్యింది. మోదీ ఒక్కరే రూ.100 లక్షల కోట్ల అప్పు చేశారు’’ అని కేటీఆర్ విమర్శించారు.

Updated Date - 2022-10-29T14:51:22+05:30 IST