Bandi Sanjay BJP : కేసీఆర్‌కు లిక్కర్ స్కాం భయం
ABN , First Publish Date - 2022-10-31T05:23:30+05:30 IST
లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగానే ఆ భయంతో తెలంగాణలోకి సీబీఐ రాకుండా సీఎం కేసీఆర్ జీవో 51ని విడుదల చేశారని బీజేపీ ..
అందుకే రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఉత్తర్వు..
సీఎం కాన్వాయ్‌లో మునుగోడుకు డబ్బు సంచులు
ఎనిమిదేళ్లుగా చేయని పనులు 15రోజుల్లో చేస్తారా?
సూడు సూడు నల్లగొండ పాట కేసీఆర్ రాయలేదు
ఆ ఎమ్మెల్యేలు సెకండ్ హ్యాండ్‌గాళ్లు: బండి సంజయ్
నల్లగొండ/సైదాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగానే ఆ భయంతో తెలంగాణలోకి సీబీఐ రాకుండా సీఎం కేసీఆర్ జీవో 51ని విడుదల చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవిత పేరు వినిపించిందని, ఆ స్కామ్‌పై విచారణ జరుగుతున్న సమయంలో ఈ జీవో తీసుకొచ్చారని తెలిపారు. రెండు నెలల క్రితమే జీవో వచ్చినా ఇంత వరకు దానిని ప్రజలకు అందుబాటులో పెట్టలేదన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. చండూరులో సీఎం పాల్గొనే బహిరంగ సభ సందర్భంగా ఆయన కాన్వాయ్‌లో మునుగోడుకు డబ్బు సంచులు వచ్చాయని, ఒక్కో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు సిద్ధం చేసిన డబ్బును తీసుకొచ్చారని ఆరోపించారు. నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంలో ఏ తప్పు చేయకుంటే ఆ ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ ఎనిమిదేళ్లలో 37 మంది ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారన్నారు. వారికి ఎన్ని డబ్బులు ఇచ్చారో, ఏం ప్రలోభాలు చూపించి చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
8 ఏళ్లుగా మునుగోడుపై నిర్లక్ష్యం..
ఎనిమిదేళ్లలో కేసీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారని.. గ్రామాలు, మండలాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో వెల్లడించాలని సంజయ్ డిమాండ్ చేశారు. శివన్నగూడెం ప్రాజెక్టు, గ్రామాలకు రోడ్ల నిర్మాణం చిన్నపనులైతే ఇన్నేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ పనులు కేంద్రం ఆపిందని అబద్ధాలు చెప్పాడని.. ఇప్పుడేమో 15 రోజుల్లో పూర్తి చేస్తానని కథలు చెబుతున్నాడని విమర్శించారు. ‘కిష్టరాయన్‌పల్లి, డిండి ప్రాజెక్టులు ఏమయ్యాయి..? పాలమూరు-రంగారెడ్డి ఏమైంది. నువ్వు ఇన్‌చార్జ్‌గా ఉన్న లెంకలపల్లిలో ఆర్వో ప్లాంట్ నీళ్లు తాగుతున్నారు. మరి మిషన్ భగీరథ ఏమైంది..?’ అని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నిక కాగానే కరెంటు చార్జీలు పెంచేందుకు స్కెచ్ వేశారని తెలిపారు. విద్యుత్తు సంస్థలు రూ.70 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయని.. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ‘ఉద్యోగులను ఏం ఉద్ధరించారని టీఎన్‌జీవో నేతలు కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్నారు..? 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరిని చేసినందుకా..? జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకా?’ అంటూ ప్రశ్నించారు. నూలు, వస్త్రాల రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైందని నిలదీశారు. జీఎస్టీ గురించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జీఎస్టీ వేయాలని మంత్రి హరీశ్ రావు చెప్పిన విషయం మరిచిపోయారా..? అని సంజయ్ నిలదీశారు.
37 మంది ఎమ్మెల్యేలను కొన్నారు..
‘రూ.100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటారంట.. వాళ్లు ఆణిముత్యాలంట.. వాళ్లంతా సెకండ్ హ్యాండ్‌గాళ్లు.. ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్‌ఎ్‌సకు అమ్ముడుపోయినోళ్లు..’ అని సంజయ్ అన్నారు. ఏటా వడ్లు కొనేది, పైసలిచ్చేది కేంద్రమేనని.. కేసీఆర్ మాత్రం ఎనిమిదేళ్లలో 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారని దుయ్యబట్టారు. మొన్నటిదాక కమ్యూనిస్టులు తోకపార్టీలు, సూది దబ్బనం పార్టీలన్న కేసీఆర్‌కు ఇవాళ ఆ పార్టీలు ప్రగతిశీల శక్తులుగా కనబడుతున్నాయా..? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలు, ఇళ్లు, ఉద్యోగాలు, రైతుల సమస్యలపై కమ్యూనిస్టులు నిన్నటి వరకు కొట్లాడారని.. ఆ సమస్యలు తీరిపోయాయా అని నిలదీశారు. ఎన్ని వేల కోట్లు ముట్టజెబితే టీఆర్‌ఎ్‌సకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. ‘సూడు సూడు నల్లగొండ.. గుండెపైన ఫ్లోరైడ్ బండ’ పాట తానే రాశానని సిగ్గులేకుండా కేసీఆర్ చెప్పుకున్నాడని.. ఆ పాట రాసింది కోదాటి శ్రీను అని సంజయ్ తెలిపారు.
మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం: అర్వింద్
సీఎం కేసీఆర్ ఎన్ని నాటకాలాడినా మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ఎంపీ అర్వింద్ అన్నారు. ఆదివారం చంపాపేటలోని బాలాజీ గార్డెన్స్‌లో మునుగోడు నియోజకవర్గం పరిధిలోని మర్రిగూడ, నాంపల్లి మండల ఓటర్లతో నిర్వహించిన సమావేశంలో అర్వింద్ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. పజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడితే బ్రోకర్‌గాళ్లు, సన్నాసులని కేసీఆర్, కేటీఆర్‌లు వ్యాఖ్యానించడం దారుణమని డీకే అరుణ అన్నారు. గౌరవ హోదాలో ఉండి చిల్లర మాటలు మాట్లాడటం సరికాదన్నారు.