Alapati Rajendra Prasad: జగన్‌పై టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కామెంట్స్
ABN , First Publish Date - 2023-04-06T20:53:19+05:30 IST
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)పై టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Alapati Rajendra Prasad) విమర్శలు గుప్పించారు
అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)పై టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Alapati Rajendra Prasad) విమర్శలు గుప్పించారు. 'ఫ్యామిలీ డాక్టర్' ప్రోగ్రామ్ పెద్ద జోక్ అని, వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ఆలపాటి డిమాండ్ చేశారు. ఆస్పత్రులకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించడం లేదని, కేవలం 2,875 మంది వైద్యులతో రాష్ట్రమంతా నాణ్యమైన వైద్యసేవలు ఎలా అందిస్తారో చెప్పాలన్నారు. పరికరాలు, మందులు సరఫరా చేయలేకపోతున్నారని, కుక్కకాటు, పాము కాటు ఇంజక్షన్లు అందుబాటులో లేవని ఆలపాటి విమర్శించారు. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిరాకరిస్తున్నాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను ముప్పుతిప్పులు పెడుతున్న వైసీపీ పాలన అంతం కాబోతోందని.. చంద్రబాబు సువర్ణపాలన రాబోతుందని ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు మీదకు తోసి ప్రజల్లో సానుభూతి పొంది గెలిచారని అన్నారు. తీరా గెలిచిన తరువాత హత్యకేసులో అసలు దోషులు అవినాష్‌రెడ్డి అండ్ కో అని తేలడంతో వారిని కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. తన తండ్రి హత్యకు కారకులైన వారికి కఠిన శిక్షపడాలని వివేకా కుమార్తె చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సిన జగన్, సొంత బాబాయిని చంపిన నిందితులకు రక్షణగా నిలుస్తుంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా అని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.